సబ్సిడీ రుణాలకు 20 లక్షలకు పైగా దరఖాస్తులు

11 Nov, 2019 05:00 IST|Sakshi

ఈనెల 10తో ముగిసిన గడువు 

సాక్షి, అమరావతి: వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాల కోసం ఈ ఏడాది మొత్తం 20,67,509 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన గడువు ఈనెల 10వ తేదీ ఆదివారంతో ముగిసింది. మొత్తం 1,94,582 మందికి రుణాలివ్వాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సర్కారుకు 20లక్షలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ మొత్తం దరఖాస్తులు ఆన్‌లైన్‌ బెనిఫిషరీ మేనేజ్‌మెంట్‌ మానిటరింగ్‌ సిస్టం (ఓబీఎంఎంఎస్‌) ద్వారా 20 కార్పొరేషన్లకు దరఖాస్తులు అందాయి. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఎంబీసీ, క్రిస్టియన్‌ మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగుల కార్పొరేషన్‌తో పాటు మరికొన్ని ఉన్నాయి.

ప్రధానంగా బీసీ కార్పొరేషన్‌కు 6,93,914 దరఖాస్తులు, ఎస్సీ కార్పొరేషన్‌కు 3,07,473, కాపు కార్పొరేషన్‌కు 2,08,007, మైనార్టీ కార్పొరేషన్‌కు 2,56,922 దరఖాస్తులు వచ్చాయి. కాగా, మండల స్థాయిలో ఎంపీడీఓలతో ప్రభుత్వం నియమించిన కమిటీలు.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మునిసిపల్‌ కమిషనర్లతో నియమించిన కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.3,405.79 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలివ్వనుంది. ఇందులో సబ్సిడీ కింద రూ.1,678.50 కోట్లు ఇవ్వనుంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు