ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య'మస్తు'

29 Jun, 2020 03:09 IST|Sakshi

ఒకే రిక్రూట్‌మెంట్‌లో 41 శాతానికిపైగా అదనంగా డాక్టర్లు

నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి!

భారీగా వైద్య పోస్టుల భర్తీతో ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతం

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికీ ఇద్దరు డాక్టర్లు

వైద్య సిబ్బంది భర్తీతో 24 గంటలూ ప్రజాసేవ

రెండు నెలల్లో యువ వైద్యులతో కొత్త కళ

ఇప్పటిదాకా 6 వేలకుపైగా దరఖాస్తులు

ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 5,222 మంది వైద్యులున్నారు. కొత్త  నోటిఫికేషన్‌ ద్వారా 2,153 వైద్య పోస్టులు భర్తీ చేయనున్నారు. తద్వారా 41 శాతం మందికిపైగా వైద్యులు అదనంగా రానున్నారు. దీంతో పాటు స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్లను కూడా నియమిస్తారు. తాజా నోటిఫికేషన్‌కు జూన్‌ 28వతేదీ నాటికి 6 వేల మందికిపైగా వైద్యులు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది.

యువ వైద్యులకు మంచి అవకాశం..
‘నేను ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తి చేశా. కోవిడ్‌ నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నా. కొత్త నోటిఫికేషన్‌లో సివిల్‌
అసిస్టెంట్‌ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నా. నాలాంటి యువ వైద్యులకు ఇది మంచి అవకాశం’   
 –డా.నమ్రత అన్నపురెడ్డి, గుంటూరు

సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి వైద్య పోస్టుల నియామకాలు చేపట్టకపోవడంతో అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వాసుపత్రుల దుస్థితి ఇక తొలగిపోనుంది. ఒకే ఒక్క నోటిఫికేషన్‌ ద్వారా తొమ్మిది వేలకుపైగా వైద్య పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ఆరోగ్యశాఖకు అదనపు బలం చేకూరనుంది. గత ప్రభుత్వాలు నియామకాలను భారంగా భావించడంతో ప్రభుత్వాస్పత్రులు నిర్వీర్యమయ్యాయి. గాయమై వెళితే కనీసం దూది, సూది ఉంటాయో లేదో కూడా తెలియని దురవస్థ దాపురించింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యానికి డబ్బుల్లేక, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందక సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడ చూసినా వైద్యులు, మందుల కొరతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దయనీయంగా కనిపించేవి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతో ఇదంతా ఇక గతంగా మిగలనుంది. రాష్ట్రంలోని 1,175 పీహెచ్‌సీలు ఇకపై 24 గంటలూ పనిచేయనున్నాయి. ఇద్దరు డాక్టర్లతో పాటు స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్ట్‌లు వీటిల్లో అందుబాటులో ఉంటారు. ఒకే ఒక్క నియామకం ద్వారా 9,712  వైద్య పోస్టులు భర్తీ చేస్తుండటం నలభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఆస్పత్రుల్లో మానవ వనరుల అభివృద్ధి, రోగుల భరోసాకు సూచికగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిద్వారా గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు వైద్యుల కొరత తీరనుంది. యువ వైద్యులు, అనుభవజ్ఞులతో రెండు నెలల్లో ప్రభుత్వాసుపత్రులు కొత్తకళ సంతరించుకోనున్నాయి.

ఇక 24 గంటలూ ‘ఆరోగ్యం’
రాష్ట్రంలో 1,175 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుండగా ప్రస్తుతం సగం పీహెచ్‌సీల్లో ఒకే ఒక డాక్టరు ఉన్నారు. వైద్యుడు సెలవుపై వెళితే ఇక స్టాఫ్‌ నర్సే దిక్కు. అర్ధరాత్రి వేళ పాముకాటుతోనే, గాయాలపాలై పీహెచ్‌సీకి వెళితే తాళాలు వేసి కనిపించేవి. ఇకపై ఇలా ఉండదు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ 24 గంటలు పనిచేస్తాయి. ఒక్కో పీహెచ్‌సీకి రోజుకు సగటున 100 మంది ఔట్‌ పేషెంటు సేవల కోసం వస్తుంటారు. అంటే రోజుకు లక్ష మందికిపైగా పీహెచ్‌సీలకు వస్తారు. కొత్తగా డాక్టర్లు, ఫార్మసిస్ట్‌లు, స్టాఫ్‌ నర్సులను నియమిస్తే 24 గంటలూ ఆస్పత్రులు పనిచేయడంతో సామాన్యులకు ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇబ్బంది ఉండదు.

70 సీహెచ్‌సీలకు నలుగురు చొప్పున.. 
రాష్ట్రవ్యాప్తంగా 192 సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్యకేంద్రాలు)లు ఉన్నాయి. వీటిలో గైనకాలజిస్ట్, అనస్థీషియా పీడియాట్రిక్స్‌ వైద్యులు బృందం ఉంటుంది. ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్న 70 సీహెచ్‌సీలను గుర్తించి ఒక్కో కేంద్రానికి నలుగురు గైనకాలజిస్ట్‌లను నియమిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా కాన్పు గదులను తీర్చిదిద్దుతున్నారు. మిగతా సీహెచ్‌సీలలో సైతం గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్‌ వైద్యుల బృందం ఉండేలా చర్యలు తీసుకుంటారు.

స్పెషాలిటీ సేవలు విస్తృతం..
ప్రస్తుతం 11 బోధనాసుపత్రులు, అనుబంధ వైద్యకళాశాలలున్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రధానంగా రెసిడెంట్‌ పీజీలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. తాజాగా చేపడుతున్న నియామకాల్లో 737 మంది వీరే ఉన్నారు. 32 స్పెషాలిటీలకు సంబంధించి వైద్యులు కొత్తగా చేరతారు. దీంతో లక్షలాదిమంది రోగులకు స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయి.

గ్రామాల నుంచే మెరుగైన వైద్యం
పీహెచ్‌సీల స్థాయిలోనే వ్యాధిని గుర్తించడం, వైద్యం చేయడం వల్ల జబ్బులను త్వరగా గుర్తించవచ్చు. బాధితులకు కూడా ఆర్థికంగా, శారీరకంగా ఉపశమనం లభిస్తుంది. గ్రామీణ వైద్యం బలోపేతం అయ్యేందుకు వైద్యుల భర్తీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్‌ ప్రక్రియ.
–డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ

ఇన్ని పోస్టులంటే నమ్మలేకున్నాం..
ఒకే నోటిఫికేషన్‌ ద్వారా ఇన్ని పోస్టులంటే నమ్మలేకపోతున్నాం. డీ ఫార్మసీ పూర్తిచేసి ఐదేళ్లయింది. మెడికల్‌ షాప్‌ పెట్టుకున్నా. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నా. ప్రభుత్వ సర్వీసులో పనిచేయాలన్నది నా కల.
– సునీల్‌ కుమార్‌రెడ్డి, ఫార్మసిస్ట్, కమలాపురం

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాం..
నాలాంటి వారు ఎన్నో రోజుల నుంచి డాక్టర్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులో చేసి పని చేసేందుకు ఎంతోమంది ఉవ్విళ్లూరుతున్నారు. నేను ఇప్పటికే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేశా.
    – డా.ఎం.మోహన్‌కుమార్, తిరుపతి

మూడు రకాలుగా మేలు
వైద్య నియామకాలు చేపట్టడం వల్ల మూడు ప్రధాన ఉపయోగాలు ఉంటాయి. పేషెంట్‌ కేర్‌ గణనీయంగా పెరుగుతుంది. వైద్య విద్య మెరుగుపడుతుంది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయించిన మేరకు డెఫిషియన్సీ (లోపాలు) తగ్గించుకోవచ్చు.
–డా.కె.బాబ్జీ, ప్రిన్సిపల్, రంగరాయ ప్రభుత్వ వైద్యకళాశాల, కాకినాడ

మరిన్ని వార్తలు