మరిన్ని బేస్‌ క్యాంపులు

23 Nov, 2013 02:01 IST|Sakshi

 =ఎర్రచందనం చెట్లను నరకక ముందే అడ్డుకుంటాం
 =త్వరలో రెండంచెలుగా ఎర్రచందనం వేలం
 =‘సాక్షి’తో అటవీశాఖ కన్సర్వేటర్ రవికుమార్

 
సాక్షి, తిరుపతి: వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న శేషాచల అడవుల్లోంచి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరి న్ని బేస్‌క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రవికుమార్ తెలిపారు. దీని ద్వారా అడవిలో చెట్లను నరకక ముందే ఎర్రచందనం కూలీలను పట్టుకోవచ్చన్నారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు.

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించేలా, జరిమానాను లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఎర్ర కూలీలకు డబ్బు ఆశ చూపించి తీసుకుని వస్తున్నారన్నారు. రోజుకు వెయ్యి రూపాయలు కూలీ ఇస్తున్నారని, ఒక వేళ పట్టుబడినా, వదిలి పెట్టేస్తున్నారనే ఉద్దేశంతో ఎక్కువ మంది కూలీలు వస్తున్నారన్నారు. కఠిన శిక్షలు అమలు చే స్తే ఎర్రకూలీలు వచ్చేందుకు జంకుతారన్నారు.
 
నిల్వ ఉన్న ఎర్రచందనం త్వరలో వేలం

వివిధ సందర్భాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను త్వరలోనే వేలం వేస్తామన్నారు. తమవద్ద ఐదువేల టన్నుల ఎర్రచందనం నిల్వ ఉందని, దీనిని రెండు దఫాలుగా వేలం వేస్తామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం ఏడాదికి రెండు వేల టన్నుల అవసరం ఉందన్నారు. తమ వద్ద ఉన్న ఐదువేల టన్నులను వేలం వేయడం ద్వారా అక్రమ రవాణా తగ్గే అవకాశం ఉందన్నారు.

నెలకు సరాసరి 70 నుంచి వంద టన్నుల ఎర్రచందనం పట్టుబడుతోందని చెప్పారు. ప్రతి రోజూ దాదాపు 80 మంది టాస్క్‌ఫోర్సు సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. 40 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశామని వీటిల్లో 200 మందికి పైగా ఉన్నారన్నారు. దీంతో ఎర్ర కూలీలు అడవి లోపలికి వెళ్లలేకున్నారని తెలిపారు. అప్పుడప్పుడు వారు అసహనంతో సిబ్బందిపై దాడికి దిగుతున్నారని అటువంటి సమయంలో వారిని ఎదుర్కొనేందుకు పోలీసుల సాయం తీసుకుంటున్నామన్నారు.

తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీల సహకారంతో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోగలుగుతున్నామని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు ఏడాదికి రూ.3.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. ఎర్రచందనం వేలం ప్రారంభమయితే, అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు