గరుడసేవకు మాడవీధుల్లో బారికేడ్లు ఏర్పాటు

30 Sep, 2014 09:51 IST|Sakshi

తిరుమల : గరుడోత్సవానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీవారి ఆలయం చుట్టూ మూడంచెల భద్రతతోపాటు మాడవీధుల్లో బారిగేడ్లు, గ్యాలరీలు ఏర్పాటు చేశారు. తిరుమల ఘాట్‌రోడ్లలో అక్టోబర్ 1వ తేదీ వరకూ ద్విచక్ర వాహనాలను నిలిపివేశారు. భద్రతను కూడా పటిష్టం చేశారు. దాదాపు 5వేల మంది పోలీసులతో గరుడోత్సవానికి భద్రత కల్పిస్తున్నారు.  సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తులను గ్యాలరీల్లోకి అనుమతించనున్నారు.  గరుడసేవ సందర్భంగా తరలి వచ్చే భక్తులకు శ్రీవారి నిత్యాన్నప్రసాద సముదాయం, క్యూ కాంప్లెక్స్‌లు, క్యూలు, నాలుగు మాడ వీధుల్లో సుమారు రెండు లక్షల మందికి అన్నదానంతో పాటు మంచినీరు ఏర్పాటు చేశారు.

మాడ వీధుల్లో పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం, ఉప్మా వంటి ఆహార పొట్లాలు, వేడిపాలు, కాఫీ, టీ అందించనున్నారు. భక్తులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు తిరుమలలో పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీటీసీ సంజీవిని, 108 అంబులెన్స్ సర్వీసులు కూడా పనిచేస్తున్నాయి. అనుకోని సంఘటన ఎదురైతే నాలుగు మాడ వీధుల్లోకి ఫైర్‌ఇంజన్  సులభంగా వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా  తిరుమలేశుడు మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.  తిరుమాడవీధుల్లో ఊరేగుతున్న దేవదేవుడిని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.

మరిన్ని వార్తలు