విమానాశ్రయంలో మరిన్ని వసతులు

6 Feb, 2015 01:26 IST|Sakshi
విమానాశ్రయంలో మరిన్ని వసతులు

పెరిగిన అవసరాల కనుగుణంగా టెర్మినల్ భవనం మార్చాలి
ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై సమీక్షలో  కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు

 
గన్నవరం : పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనాన్ని మార్చాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అధికారులను ఆదేశించారు. విజయవాడను  రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధిపై చర్చించేందుకు ఆయన లాంజ్‌రూములో గురువారం ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు, జీవీకే సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం అధికారులు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనలను పరిశీలించడంతో పాటు పలు అంశాలపై చర్చించారు. పెరిగిన విమాన సర్వీసులకు అనుగుణంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనంలో ప్రయాణికులు కూర్చునేందుకు సదుపాయాలు లేవని అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. భద్రత కూడా సరిగా లేదన్నారు.
 
ఇంటర్ భవనం ప్లాన్ పరిశీలన

ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు గాను తాత్కాలిక టెర్మినల్ కోసం సుమారు రూ.105 కోట్లతో జీవీకే సంస్థ నిర్మించనున్న ఇంటర్ భవనం ప్లాన్‌ను ఆ సంస్థ ప్రతినిధులు అశ్విన్ తొరట్, చంద్రభాన్ మన్వానీ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ భవనంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేయనున్న వసతుల గురించి తెలియజేశారు. ఈ భవనం నిర్మించడం వల్ల సమీపంలో ఉన్న రాడార్ (డీవీవోఆర్) కేంద్రం ద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అందాల్సిన సిగ్నల్స్ వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుందని, ఆ కేంద్రాన్ని మరోచోటకు తరలించేందుకు అత్యవసరంగా కొంత ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. భూసేకరణ పూర్తయి, భవిష్యత్తులో శాశ్వత టెర్మినల్‌ను నిర్మించిన తర్వాత ఈ ఇంటర్ భవనాన్ని కార్గో సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇంటర్ భవన నిర్మాణానికి ఏడాదిన్నర పడుతుందని మంత్రికి వివరించారు.

అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ను 200 నుంచి 300 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అనువుగా, ఆకర్షణీయంగా రెండు, మూడు నెలల్లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు కేంద్ర మంత్రి సూచించారు. ఇందుకోసం ఏవియేషన్ రంగంలో అనుభవం ఉన్న జీవీకే సంస్థ ప్రతినిధుల సలహాలు తీసుకోవాలని చెప్పారు. హుద్‌హుద్ తుపాను ధాటికి విశాఖపట్నం విమానాశ్రయం దెబ్బతిన్నప్పటికీ ఐదు రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తిచేసి యథాస్థితికి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.
 
మరో 220 ఎకరాల భూమి కావాలి

అన్ని రకాల విమానాలూ దిగేందుకు వీలుగా రన్‌వేను 14,500 అడుగులకు విస్తరించాల్సి ఉందని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకోసం గతంలో భూసేకరణ నిమిత్తం నోటీసులు జారీచేసిన 450 ఎకరాలతో పాటు మరో 220 ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌ఈడీ ఎస్‌హెచ్ సురేష్, ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజ్‌కిషోర్, ఎంపీలు కేశినేని నాని, గోకరాజు గంగారాజు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు నష్టం లేకుండా భూసేకరణ : ఎమ్మెల్యే వంశీ

రైతులకు నష్టం లేకుండా విమానాశ్రయ భూసేకరణను ప్రభుత్వం చేపడుతుందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చెప్పారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం 440 ఎకరాలను రైతుల నుంచి సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. రన్‌వేను పూర్తిస్థాయిలో విస్తరించేందుకుగాను ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు మరో 220 ఎకరాలు కావాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూములను రైతులందరి ఆమోదం మేరకు సేకరించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. మెరుగైన ప్యాకేజీ, భూసమీకరణ పద్ధతుల్లో రైతులను సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం సేకరిస్తుందని తెలిపారు.  ఈ నెల 13న కలెక్టర్ బాబు.ఎ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా