లడ్డూలాంటి కబురు

26 Oct, 2017 07:29 IST|Sakshi
ఆలయంలో లడ్డూలను పరిశీలిస్తున్న జేఈవో శ్రీనివాసరాజు

టీటీడీ టార్గెట్‌ 5 లక్షల లడ్డూలు

కసరత్తు చేస్తున్న జేఈవో శ్రీనివాసరాజు

శ్రీవారి పోటుల విస్తరణపై ప్రత్యేక దృష్టి

రెండో విడతలో బూందీ పోటు అభివృద్ధి

సాక్షి, తిరుమల: భక్తులు ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూ  నాణ్యత, తయారీపై  టీటీడీ ప్రత్యేక దృష్టిసారించింది. రోజూ 5 లక్షల లడ్డూలు తయారు చేసి, భక్తులు కోరినన్ని అందించే దిశగా ధార్మిక సంస్థ అడుగులు వేస్తోంది.  

ఆలయంలోని రెండు పోటుల విస్తరణ
తిరుమలేశుని ఆలయంలో ప్రధానపోటు, అదనపు పోటులు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ సుమారు 200 మీటర్ల నిడివి రాతి బల్లపరుపుతో కూడిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌పై  లడ్డూలు తయారు చేస్తుంటారు. ఇక్కడే  లడ్డూ తయారీకి వాడే సరుకుల స్టో్టర్‌ కూడా ఉంటుంది. ఇందులో వారం నుంచి నెలకు సరిపడా సరుకులు ఉంచుతారు. వీటి ద్వారా సాధారణంగా రోజూ 3 నుంచి 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు.

టీటీడీ టార్గెట్‌ 5 లక్షల లడ్డూలు..
శ్రీవారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో 70వేలు, రద్దీ, పర్వదినాల్లో ఈ సంఖ్య లక్ష దాటుతోంది. ఇంతమందికి లడ్డూలు అందించటం టీటీడీకి కష్టసాధ్యమవుతోంది. దీంతో లడ్డూ ఉత్పత్తిని పెంచాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు సంకల్పించారు. అందుకోసం రెండు పోటులతోపాటు వెలుపల ఉండే బూందీ పోటును కూడా విస్తరించాలని నిర్ణయించారు. ఆ మేర కు పోటుల్లో ఉండే సరుకుల స్టోర్‌ను వెలుపలకు తరలించే ప్రతిపాదనలు చేశారు. ఒకటి నుంచి రెండు రోజులకు సరిపడా సరుకులు మాత్రమే ఉంచుకోవటం వల్ల అందుబాటులోకి వచ్చే స్థలాన్ని లడ్డూల తయారీకి వాడాలని నిర్ణయిం చారు. జేఈవో శ్రీనివాసరాజు, ఇంజనీరింగ్‌ అధికారులతో కలసి రోజువారీగా ఆలయ పోటులు సందర్శిం చారు. మరో 100 నుంచి 200 మీటర్ల స్థలం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోవైపు లడ్డూల తయారికీ వాడే యంత్రాలు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేసిన ఎస్‌ఎస్‌ 340 ఫుడ్‌గ్రేడర్‌  యంత్రాలు, అవసరాన్ని బట్టి పెంచటం, తగ్గించటం కూడా చేయనున్నారు. దీనివల్ల రోజూ 5 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు వీలు కలగనుంది.

పెరగనున్న బూందీ తయారీ..
ఆలయంలో రోజూ 5 లక్షల లడ్డూలు తయారు చేయాలంటే అందుకు అనుగుణంగా వెలుపల బూందీ పోటులోనూ బూందీ తయారీ కూడా పెంచనున్నారు. ఇటీవల కొన్ని ప్రమాద ఘటనల నేపథ్యంలో బూందీపోటును అభివృద్ధి చేశారు. ఇక రోజూ 5 లక్షల లడ్డూలు తయారు చేయాలంటే  ఆమేరకు బూందీ తయారీని కూడా పెంచాలని నిర్ణయించారు. ఈ పనులన్నీ దశలవారీగా చేపట్టనున్నారు. పనులు సకాలంలో పూర్తయితే భక్తులకు కోరినన్ని లడ్డూలతో తీపికబురు అందే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు