నేరాలు.. ఘోరాలు!

31 Jul, 2019 09:27 IST|Sakshi
కాకినాడలో హత్యకు గురైన  వృద్ధదంపతులు

జిల్లాలో పెరుగుతున్న  నేరాలు.. ఘోరాలు

క్షణికావేశంలో జరుగుతున్న ఘటనలే అధికం.

అనుమానంతో కిరాతకంగా  హతమారుస్తున్న వైనం

అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీస్‌శాఖదే 

సాక్షి, కాకినాడ క్రైం(తూర్పుగోదావరి) : క్షణికావేశంలో కొందరు.. కావాలని మరికొందరు.. ఆస్తికోసం కొందరు.. అనుమానంతో ఇంకొందరు.. ఇలా హత్యలు చేసి తమ జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో హత్యానేరాల సంఖ్య పెరిగింది. భార్యపై అనుమానాలు, ఆస్తి తగదాల నేపథ్యంలోనే హత్యలు జరుగుతుండడంతో జిల్లాలో భయాందోళనలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో జరిగిన జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే విధంగా 45 రోజుల క్రితం జిల్లా కేంద్రంకాకినాడలో జరిగి వృద్ధదంపతుల హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు ఇప్పటి వరకు ఛేదించక పోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

చిన్న, చిన్న విషయాలకే..
ఇటీవల కాలంలో జిల్లా పరిధిలో చోటు చేసుకుంటున్న హత్యలు క్షణికావేశంలో చోటు చేసుకుంటున్నవే అధికం. వీరందరూ చిన్న గొడవలు, ఆస్తి తగదాలు, అనుమానాలతో హత్యలకు పాల్ప డుతున్నారు. ఈ ఏడాది ఎక్కువ శాతం మహిళలే హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా అనుమానం పెనుభూతంగా మారి హత్యలకు దారితీస్తోందని పోలీసులు చెబుతున్నారు. 

శిక్షలపై అవగాహనేది?
జిల్లాలో జరుగుతున్న హత్యలపై ప్రజల్లో నెలకొన్న భయాన్ని తగ్గించడం కోసం ఆయా నియోజక వర్గాల పరిధిలోని పోలీస్‌ శాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ నేరం చేస్తే ఎంతకాలం శిక్ష పడుతుంది? జైలులో అనుభవించాల్సిన కష్టాలు, నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకున్న వారి జీవితకథలను ప్రజలకు వివరిస్తే కొంత మేరకు ఈ హత్యలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంటుంది. నేరాలు చేసి జైలుకు వెళితే.. వారి పిల్లల భవిష్యత్తు ఏంటనే స్పృహ వారిలో కలిగిస్తే కాస్త హత్యానేరాలను కొంత మేర అరికట్టవచ్చు.

జిల్లాలో జరిగిన హత్యలు ఇలా..
జూన్‌ ఏడో తేదీన  కాకినాడలో వృద్ధ దంపతుల హత్య జరిగింది. కాకినాడ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న ముమ్మిడివారి వీధిలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ దంపతుల హత్యకు                  కారణాలేంటనే విషయంపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 50 రోజులు దాటినా నేటికీ ఈ హత్య విషయాన్ని పోలీసులు ఛేదించలేకపోవడం విశేషం.
కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట పంచాయతీ బర్మాకాలనీలో ఏప్రిల్‌ 17న తల్లితో తండ్రి ప్రతిరోజు గొడవ పడి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, భావించిన దత్తత కొడుకు కుమార్‌ కర్రతో తండ్రిని        కొట్టాడు. ఆ దెబ్బలకు తండ్రి గోపిరెడ్డి ఈశ్వరరావు చనిపోయాడు. వెంటనే తల్లి సాయంతో ఇంటి పెరట్లోనే గొయ్యి తీసి మూడో కంటికి తెలియకుండా పూడ్చివేశాడు.
కాకినాడ సురేష్‌నగర్‌లో పైడిముక్కల రవీంద్రనాథ్‌  అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. స్నేహితుల మధ్య ఉండే గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 
కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన ఓ యువతికి మే 15న కరపకు చెందిన యువకుడితో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన వారం రోజులకే తన ప్రియుడితో కలిసి పెనుగుదురులో కట్టుకున్న భర్తను            కడతేర్చింది.
మండపేటలో వరి చేలో ఓ మహిళను పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. వివాహేతర సంబంధాలు వల్లే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా జిల్లాలో అనేక చోట్ల హత్యలు          క్షణికావేశంలోనే జరుగుతున్నాయి.

అవగాహన కల్పిస్తాం
జిల్లా పరిధిలో జరిగిన హత్యలు క్షణికావేశంతో అవగాహన లోపంతో జరుతున్నవే అధికం. నేరాలు చేస్తే జరిగే పరిణామాలపై శిక్షలపై పోలీస్‌శాఖ తరఫున ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. చట్టపరిధిని దాటి ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తాం.
 – అద్నాన్‌ నయీం అస్మీ, ఎస్పీ 

మరిన్ని వార్తలు