‘కస్తూర్బా’లో బోలెడు సమస్యలు

26 Jan, 2014 01:59 IST|Sakshi

అల్లాదుర్గం రూరల్, న్యూస్‌లైన్: బడి మానేసిన బాలికల కోసం ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను స్థాపించింది. అయితే కనీస వసతులు కల్పించడంలో విఫలమైంది. అల్లాదుర్గం లోని కస్తూర్బా విద్యాలయంలో అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. గదుల కొరత కారణంగా విద్యార్థులు తరగతి గదుల్లోనే భోజనం చేయాల్సి వస్తోంది. ఇక్కడే సేద తీరుతున్నారు. ఈ విద్యాలయంలో బాలికలకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. లక్షల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన అదనపు గదులు నిరుపయోగంగా ఉన్నాయి.

గ్యాస్ కనెక్షన్ లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. పొగ కారణంగా విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. గతంలో ఇక్కడ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన జ్యోతీర్మయిని కొన్ని కారణాల వల్ల అధికారులు తొలగించారు. ప్రస్తుతం జ్యోతి అనధికారికంగా ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమెకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల జ్యోతి విధులు సక్రమంగా నిర్వహించ లేకపోతున్నారు. ఈ కారణాల వల్ల సిబ్బందికి వేతనాలు అందడం లేదు. సొంత డబ్బుతో విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యలను జిల్లా స్థాయి అధికారులకు వివరించినట్లు జ్యోతి తెలిపారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో 160 మంది బాలికలు చదువుకుంటున్నారు.

శనివారం సగం మంది విద్యార్థులే ఉన్నారు. ఈ విద్యాలయంలో లక్షలు వెచ్చించి నిర్మించిన 6 అదనపు గదులు వృథాగా ఉన్నాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించ పోవడంతో ఆ గదులను అధికారులకు అప్పగించలేదు. ప్రస్తుతం తరగతి గదుల్లోనే విద్యార్థులు పెట్టెలు, దుప్పట్లు, బక్కెట్లు ఉంచుకుంటున్నారు. ప్రస్తుత ప్రిన్సిపాల్ జోగిపేటలో నివాసం ఉంటున్నారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వసతులు లేకపోవడం వల్ల సంక్రాంతి పండుగకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాలేదు.

 కస్తూర్బా విద్యాలయంలో నెలకొన్న సమస్యలపై సంబంధిత సన్నిహిత అధికారిగా వ్యవహరిస్తున్న తహశీల్దార్ గపార్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా, బ్యాంకు ఖాతా తెరవాలని మూడు రోజుల క్రితం ప్రిన్సిపాల్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఖాతా తెరచిన తరువాత ప్రభుత్వం అందులో డబ్బు జమ చేస్తుందని, తరువాత సిబ్బంది జీతాలు, ఇతర అవసరాలు తీరుతాయని వివరించారు.

మరిన్ని వార్తలు