వైఎస్‌ జగన్‌కు భద్రత పెంచాలి

30 Oct, 2018 12:56 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

ఆయన ప్రాణానికి ముప్పుంది

ప్రజా సంకల్పయాత్రను ఆపేందుకు కుట్ర

హత్యాయత్నంపై న్యాయ విచారణ జరపాలి

నటుడు శివాజీని అరెస్ట్‌ చేయాలి

ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌

ప్రకాశం, మార్కాపురం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణానికి ముప్పు ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనకు భద్రతను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సోమవారం మార్కాపురంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసిన టీడీపీ నేతలు దానిని ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు జరిపినా జగనన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తాడని, భయపడబోరని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతుందని సురేష్‌ అన్నారు. ఐపీసీ 118, 171, 176, 201 సెక్షన్ల ప్రకారం సీఆర్‌పీసీ సెక్షన్‌ 39 ప్రకారంనేర సమాచారం తెలిస్తే పోలీసు అధికారులకు, మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలని, లేకపోతే రెండు లేదా మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చన్నారు. ఈ సెక్షన్లనీన్నీ నటుడు శివాజీకి వర్తిస్తాయన్నారు. శివాజీ చెప్పినట్లే రాష్ట్రంలో జరుగుతున్నాయని, ఆయనకు నేర సమాచారం తెలుసు కనుక అదుపులోకి తీసుకుని విచారణ చేసి అరెస్ట్‌ చేయాలని సురేష్‌ డిమాండ్‌ చేశారు.

పెద్దల బాధ్యతా రాహిత్యం..
జగన్‌పై దాడి జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌లు స్పందించిన తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. బాధ్యతారాహిత్యంగా డీజీపీ ప్రకటన ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రతిదీ రాజకీయ కోణంలో చూడటం మంచి సంప్రదాయం కాదన్నారు. జగన్‌పై దాడి జరిగిన వెంటనే తెలంగాణ సీఎం, మంత్రులు, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు, జాతీయ నేతలు ఖండిస్తే ముఖ్యమంత్రి మాత్రం వారిని కూడా తప్పు పట్టే స్థాయికి వెళ్లారన్నారు. దేవుడి దయ, ప్రజల అభిమానం ఉండటం వల్లే జగన్‌ ప్రాణాలతో బయటపడ్డారన్నారు. హత్యాయత్నం జరిగిన అర గంటకే నేరస్తుడిని విచారణ చేయకుండా డీజీపీ చేసిన ప్రకటన దారుణమన్నారు. సీఎం స్క్రిప్ట్‌ను డీజీపీ చదువుతున్నారన్నారు. హత్యాయత్నంపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం తప్పనిసరన్నారు. చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగినప్పుడు అప్పటి ప్రతిపక్షనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలకు గుర్తుందన్నారు. జగన్‌కు భద్రత పెంచకపోతే తామే పాదయాత్రలో పాల్గొని రక్షణగా ఉంటామన్నారు. నటుడు శివాజీపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే సురేష్‌ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే వెంట పెద్దదోర్నాల జెడ్పీటీసీ అమిరెడ్డి రామిరెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు