కిడ్నీ రోగులకు మరిన్ని సేవలు

12 Mar, 2017 14:40 IST|Sakshi
కిడ్నీ రోగులకు మరిన్ని సేవలు

► సర్వేలో గుర్తించిన వారికి తదుపరి పరీక్షలు చేయాలి
► కిడ్నీ రోగుల వైద్యంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
► ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ అరుణకుమారి   


శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : ఉద్దానం ఇతర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి బాధితులకు మెరుగైన సేవలు అందించాలని, వారిని గుర్తించి వ్యాధి ముదరక ముందే చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎస్‌.అరుణకుమారి అన్నారు. ఉద్దానం కిడ్నీ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రుల వైద్యాధికారులకు శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో కిడ్నీవ్యాధులపై ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉద్దానం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే ను కచ్చితంగా కొనసాగించాలని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న వారిని హరిపురం, పలాసల్లోని సీఈసీ కేంద్రాలకు పంపించాలని తెలిపారు. రోగుల పరిస్థితులు, అలవాట్లపై అధ్యయనం చేయాలని అన్నారు. అలాగే కిడ్నీ రోగం దశలు, రకాలు కూడా గుర్తిం చాలని అన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న మందులు ఎంతవరకు పనిచేస్తున్నాయి, వాటి పరిస్థితి, మం దుల కొరత, ఇంకా కావల్సిన వసతుల గురించి ఆరా తీశారు. రానున్న రోజుల్లో ఎ లాంటి సేవలు అం దించాలి, మెరుగైన సేవలకు కావల్సిన చర్యలపై చర్చించారు. ప్రతి రోగికీ తప్పని సరిగా కౌన్సిలింగ్‌ చేయాలని అన్నారు.

ఏపీ వైద్యవిధాన పరిషత్‌ జాయింట్‌ కమిషనర్‌ జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ కిడ్నీ రోగుల గుర్తింపు ప్రాథమిక దశలో ఉంటే మందుల ద్వారా ఎంతవరకు నయం చేయగలమో అంతవరకు వారికి తగిన సేవలు, మందులు అందించాలని తెలిపారు. సర్వేలో రోగి పూర్తి వివరాలు ఉండడంతో వారికి తగిన సూచనలు, సలహాలు అందించి, వారి జీవిత కాలం పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎంహెచ్‌ఓ తిరుపతిరావు మాట్లాడుతూ ఇప్పటివరకు 13 వేల మందిని సర్వే చేశామని, 9వేల మంది హైరిస్క్‌లో ఉన్నారని వివరించారు. మిగిలిన వారికి సర్వేలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖపట్నం కేజీహెచ్‌కు చెందిన నెఫ్రాలజీ ప్రొఫెసర్‌ ప్రసాద్‌ కిడ్నీ వ్యాధి రకాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ బొడ్డేపల్లి సూర్యారావు, వైద్యాధికారులు బగాది జగన్నాథరావు, మెండ ప్రవీణ్, 17 పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు