ముందుంది నిప్పుల వాన!

15 May, 2019 04:30 IST|Sakshi

రాష్ట్రంలో మరింత తీవ్ర వడగాడ్పులు 

రుతుపవనాలు వచ్చే దాకా ఇదే పరిస్థితి 

ముందే హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి 

వడదెబ్బకు గురై 15 మంది మృత్యువాత    

సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రానికి నిప్పుల ముప్పు ఇంకా పొంచి ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణ తీవ్రత కొనసాగనుంది. ఫొని తుపాను తీరాన్ని దాటక ముందు నుంచీ భానుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. ఎడతెరపి లేకుండా వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ అన్న తేడా లేకుండా సాధారణం కంటే 4–7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లోనూ వెరసి 139 మండలాల్లో వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఉష్ణోగ్రతల పెరుగుదల తీరుపై ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీడీఎంఏ) ఒక అట్లాస్‌ను రూపొందించింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే ఐఎండీ నేషనల్‌ మాన్సూన్‌ మిషన్‌ ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఉష్ణోగ్రతల ప్రభావంపై పరిశీలన చేసింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలను తీవ్ర వడగాడ్పుల ప్రభావిత ఏరియాలుగా తేల్చింది. 

ఏపీ, తెలంగాణపైనా డెడ్లీ హీట్‌వేవ్స్‌ ప్రభావం 
ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఈ వేసవిలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు (డెడ్లీ హీట్‌వేవ్స్‌) నమోదయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఇటీవల హెచ్చరించింది. వాటి ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కూడా ఉంటుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల ధాటికి చాలా మరణాలు సంభవిస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి అత్యంత అరుదుగా ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉపరితల ద్రోణి ప్రభావంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి రెండు మూడు రోజులకే పరిమితమని, ఎండలు విజృంభించి, మళ్లీ తీవ్ర వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బకు గురై మంగళవారం ప్రకాశం, అనంతపురం,  వైఎస్సార్‌ జిల్లాల్లో నలుగురు వంతున, గుంటూరు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు వంతున మృతి చెందారు. 

నేడు, రేపు కోస్తాంధ్రకు వర్ష సూచన 
కోస్తాంధ్రలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి ఒక నివేదికలో తెలిపింది. ఈదురుగాలులు, వర్షాలతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం గానీ, జల్లులు గానీ కురిసే అవకాశం ఉంది. గురువారం నుంచి అక్కడ రెండు రోజులు పొడి వాతావరణం నెలకొంటుంది. 

47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు 
‘‘జూన్‌ ఒకటి రెండు తేదీల్లో రుతుపవనాలు కేరళను తాకిన వారం పది రోజుల నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అప్పటిదాకా ద్రోణుల ప్రభావంతో ఒకట్రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసి కాస్త చల్లబరచినా మళ్లీ వడగాడ్పులు విజృంభిస్తాయి. ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్నిచోట్ల 47 డిగ్రీల వరకు నమోదై నిప్పుల కొలిమిని తలపిస్తాయి. రానున్న రెండు మూడు రోజుల్లోనే వీటి పెరుగుదల మొదలవుతుంది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మంచి వర్షాలనే కురిపిస్తాయి. ముందుగా ఊహించినట్టుగా ఎల్‌నినో (వర్షాభావ) భయం లేదు’’  
– ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్, వాతావరణం, సముద్ర అధ్యయనవిభాగ మాజీ అధిపతి. ఏయూ  

మరిన్ని వార్తలు