దోమ.. తరిమేద్దామా..!

8 Jun, 2020 12:56 IST|Sakshi
బుట్టాయగూడెం మండలంలోని గిరిజన గ్రామంలో మలాథియన్‌ స్ప్రేయింగ్‌ పనులు చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

ఏజెన్సీలో ముమ్మరంగా మలాథియాన్‌ స్ప్రేయింగ్‌

171 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు

పక్కాగా మలేరియా నివారణ చర్యలు

చినుకు పడక ముందు నుంచే పనులు

గతంతో పోలిస్తే తగ్గిన కేసులు

బుట్టాయగూడెం: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంతో పాటు వర్షాకాలంతో దోమల ద్వారా ప్రబలే వ్యాధులను నియంత్రించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పక్కా ప్రణాళికతో ఇప్పటికే పలు గ్రామాల్లో పనులను పూర్తిచేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఇక్కడ మలేరియా, డెంగీ, కామెర్లు, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇందుకు దోమలు ప్రధాన కారణం కావడంతో ఏజెన్సీ అధికారులు ప్రతి ఇంట్లో మలాథియాన్‌ స్ప్రేయింగ్‌ పనులు చేయిస్తున్నారు.

171 గ్రామాల్లో పనులు
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు గిరిజన మండలాల్లోని 171 గ్రామాలను మలేరియా సమస్యాత్మక గ్రామాలుగా అ«ధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో సుమారు 45 వేల మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 1 నుంచి వచ్చేనెల 15 వరకు మొదటి విడత స్ప్రేయింగ్‌ పనులు చేపట్టారు. ఇప్పటివరకు 40 గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో  ఆల్ఫా–సైఫర్‌ మెత్రీన్‌ (ఏసీఎం) అనే మందును పిచికారీ చేస్తుండగా బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో మలాథియాన్‌ స్ప్రేయింగ్‌ పనులు చేస్తున్నారు. పనులు చేస్తున్న కూలీలకు మాస్క్‌లు, గ్లౌజ్‌లు, సబ్బులు, శానిటైజర్‌లు అందిస్తున్నారు. 

ఏడాదికి మూడు దశల్లో..
మలేరియా, డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందకుండా ఏటా మూడు దశల్లో 171 గ్రామాల్లో 12,684 ఇళ్లల్లో దోమల మందు స్ప్రేయింగ్‌ పనులు చేస్తుంటారు. జూన్‌ 1 నుంచి జూలై 15వ తేదీ వరకు మొదటి విడత, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు రెండో విడత, అక్టోబర్‌ 1వ తేదీ నుంచి నవంబర్‌ 15 వరకు బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో స్ప్రేయింగ్‌ చేయగా, విలీన మండలాల్లో రెండు దశల్లో పనులు చేస్తారు. స్ప్రేయింగ్‌ పనులకు సుమారు 35 టన్నుల దోమల మందును  వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

మన్యం.. కేసులు తగ్గుముఖం
పశ్చిమ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో మలేరియా, డెంగీ జ్వరాల వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గతంలో ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఇటీవల కేసుల నమోదు తగ్గింది.  

సీజనల్‌ వ్యాధులపై అవగాహన
కరోనాతో పాటు వర్షాలతో గిరిజన ప్రాంతంలో వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దోమలు పెరగకుండా ప్రతి ఇంట్లో దోమల మందు స్ప్రేయింగ్‌ పనులు చేయిస్తున్నాం. ప్రజలు సీజనల్‌ వ్యాధుల పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలి.–ఆర్‌వీ సూర్యనారాయణ,ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి, కేఆర్‌ పురం 

40 గ్రామాల్లో పనులు పూర్తి
గిరిజన ప్రాంతంలో 171 గ్రామాలను మలేరియా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. ఆయా గ్రామాల్లో దోమల నివారణకు మలాథియాన్‌ స్ప్రేయింగ్‌ పనులు చేపట్టాం. ఇప్పటివరకు 40 గ్రామాల్లో మొదటి విడత పనులు పూర్తయ్యాయి. మిగిలిన గ్రామాల్లో పనులు పూర్తి చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం  –పీఎస్‌ఎస్‌ ప్రసాద్,జిల్లా మలేరియా అధికారి, కేఆర్‌ పురం  

మరిన్ని వార్తలు