పాస్‌వర్డ్‌... పర్సనల్‌ కాదుగా...!

25 Jul, 2019 10:50 IST|Sakshi

సాక్షి, కడప : చాలా మంది పుట్టిన రోజు, తేదీని, జాబ్‌లో జాయిన్‌ తేదీని రహస్య కోడ్‌గా వినియోగిస్తున్నారు. అలా చేస్తుంటే ఇబ్బంది పడతారు. ఎలాగంటే మీ కొలీగ్స్, సహచరులకు అవకాశమిచ్చినట్లే. డబ్బు ఎవరికి చేదు చెప్పండి. ప్రధాన నగరాల్లో ఒక ప్రయివేట్‌ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో ఎక్కువశాతం మంది కొన్ని నంబర్లనే పిన్, పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారని తేలింది.

ఈ నివేదిక ప్రకారం ఎక్కువ మంది వాడుతున్న పిన్‌ నెంబరు, పాస్‌వర్డు 12234, తరువాత స్థానంలో 1111 ఉంది. కేవలం సమాచారం ఇచ్చి పుచ్చుకునే ఈ మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను కష్టమైనది పెడుతున్న చాలామంది డబ్బులు, లావాదేవీలు నిర్వహించే అకౌంట్లు, డెబిట్, క్రెడిట్‌ కార్డులకు, విలువైన వ్యక్తిగత సమాచారం దాచుకునే స్మార్ట్‌ఫోన్‌కు మాత్రం సులువైన పిన్‌ నెంబర్లు పెట్టడం ఆశ్చర్యకరం. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే సైబర్‌ నేరాలు జరిగే అవకాశముందని బ్యాంకు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంస్థ నివేదిక ప్రకారం చాలామంది పుట్టిన తేదీని, సంవత్సరాన్ని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా 1980 నుంచి 2000 వరకూ పిన్‌ నంబర్లు మాత్రమే ఉంటున్నాయి.

  • డెబిట్‌ , క్రెడిట్‌ కార్డు పాస్‌వర్డ్‌ నాలుగు అంకెలు మాత్రమే ఉండాలి. సాధారణంగా నాలుగంకెల నెంబర్లు 10 వేల వరకు ఉన్నాయి. కానీ వందలో సగం మంది 10 వేల నాలుగంకెలలో కేవలం 500 నెంబర్లను మాత్రమే వినియోగిస్తున్నారు. ఇలా వాడటం వల్ల ఏటీఎంకార్డు పోయినా, చోరీకి గురైనా సులువుగా డబ్బు డ్రా చేసుకునే అవకాశం దొంగలకు ఉంటుంది.
  • చాలా మంది ఎక్కువగా వినియోగిస్తున్న పాస్‌వర్డ్స్, పిన్‌ నెంబర్లు ఇవేనని సంస్థ నివేదిక పేర్కొంది. 1234, 1111, 0000, 1212, 2222, 2244, 7777, 8888, 3333, 4444, 5555, 6666, 1122, 1313, 1010, 2001, 2010

తస్మాత్‌ జాగ్రత్త
పిన్‌ నంబరే కదా అనుకుంటే చాలా పొరపాటే. ఎందుకంటే నాలుగు అంకెల ఈ సంఖ్య మీ ఆర్థిక స్థితిగతినే మార్చేసే అవకాశముంది. ఒక్క పిన్‌ విషయంలోనే కాదు మిగిలిన విషయాల్లోనూ అప్రమత్తత అవసరం. తద్వారా మీడబ్బు భద్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దొంగిలించిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు విత్‌ డ్రా అయితే అందుకు బ్యాంకు బాధ్యత వహించదు. విషయం గుర్తించుకోవాలి. తర్వాత ఎన్ని పాట్లు పడినా పోయిన డబ్బు రాదని తెలుసుకోవాలి.

ఎప్పటికప్పుడు మారిస్తే మంచిది
పిన్‌ నంబర్లను నెలకు, రెండు నెలకొకసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీ జరిపిన తక్షణం పిన్‌నంబర్‌ మారిస్తే సైబర్‌నేరగాళ్లకు చిక్కకుండా బయట పడొచ్చంటున్నారు. అదే విధంగా పిన్‌నంబర్‌ నమోదు చేసే ముందు మిమ్మల్ని ఎవరైనా గమనించనట్‌లైతే మీ లావాదేవీని వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

పిన్‌ ఎంటర్‌ చేసే సమయంలో ఇతర వ్యక్తులు సహాయం చేస్తామని వస్తే నిరాకరించాలి. చాలా మంది పిన్‌ నెంబరు మరిచిపోతామనే ఉద్దేశంతో పౌచ్‌లో రాసి ఉంచుతారు. ఇది చాలా ప్రమాదం. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే, మీ మెదడులో పాస్‌వర్డును భద్రంగా దాచుకుంటే ఇబ్బందులుండవు. 

>
మరిన్ని వార్తలు