తీరని గర్భశోకం!

22 Sep, 2018 11:14 IST|Sakshi
మృతిచెందిన శిశువు

ఏరియా వైద్యశాలలో తరుచూ శిశుమరణాలు

20 రోజుల వ్యవధిలో ఐదుగురి మృతి

నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం

ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

నలుగురు చేయాల్సిన పనిని ఒక్కరే చేస్తూ పనిభారాన్ని మోస్తున్న సిబ్బంది.. దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయని ప్రభుత్వం.. వైద్యులు అందుబాటులో ఉండి కూడా పర్యవేక్షణ లేకపోవటం.. వెరసి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో తరుచూ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ పాపానికి బాధ్యులెవరనేది ప్రశ్నగా మారింది. నవమాసాలు మోసి పండంటి బిడ్డను కనేందుకు ఎంతో ఆశగా వస్తుంటే తమకు తీరని గర్భశోకాన్ని మిగులుస్తున్నారని తల్లులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఈ దుస్థితికి బాధ్యులెవరని వారు ప్రశ్నిస్తున్నారు.

గుంటూరు, నరసరావుపేట టౌన్‌:  ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పల్నాడు ప్రాంతంతో పాటు ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచి వందల సంఖ్యలో గర్భిణులు సేవల కోసం వస్తుంటారు. ప్రతిరోజు వస్తున్న ఓపీ లో 60 శాతం గర్భిణులే అధికంగా ఉంటున్నారు. నెలకు 400 నుంచి 450 వరకు డెలివరీలు అవుతున్నాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాల తరువాత జిల్లాలో అధికంగా ప్రసవాలు జరుగుతున్న ఏరియా వైద్యశాలలో నరసరావుపేట వైద్యశాల ప్రథమంగా ఉంది. రోజుకు సగటున 20 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. ఉన్న కొద్దిపాటి సిబ్బంది కారణంగా గర్భిణీలకు మెరుగైన సేవలు అందించలేక పోతున్నామని వైద్యవర్గాలు చెప్పుకొస్తున్నాయి.

కొరవడిన పర్యవేక్షణ..
మూడురోజుల క్రితం ప్రకాష్‌నగర్‌కు చెందిన కండెల తిరుపతమ్మ కాన్పు కోసం ఏరియా వైద్యశాలలో చేరి బిడ్డను కోల్పోయింది. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా సిబ్బంది ఇష్టారాజ్యంగా డెలివరీ చేయటంతో శిశువు మృతి చెందిందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో కూడా పసికందులు మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నప్పటికి అందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. నెలకు కనీసం ఐదుగురు పసికందులు మృతిచెందటం ఏరియా వైద్యశాలలో పరిపాటిగా మారింది. ఈ నెలలో గత 20 రోజుల వ్యవధిలో ఐదుగురు పసికందులు మృతి చెందినట్లు వైద్యవర్గాల ద్వారా సమాచారం. అయితే విచారణ జరిపి అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు నేటివరకు లేవు. మాతా శిశుమరణాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టామని చెబుతున్నప్పటికీ చోటు చేసుకుంటున్న మరణాల బట్టి ఆచరణలో సాధ్యం కావటం లేదనేది అవగతమవుతుంది.

తీవ్రమైన పని భారం ...
వైద్యశాలకు వస్తున్న రోగుల సంఖ్యను బట్టి నలుగురు గైనకాలజిస్టు డాక్టర్లు అవసరం. అయితే ఇద్దరు డాక్టర్లే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కాన్పుల విభాగంలో 24 మంది సిబ్బంది అవసరం ఉండగా 20 మందే ఉన్నారు. దీంతో డాక్టర్లు, సిబ్బంది తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారు. ఆ ప్రభావం సేవలపై పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వంద పడకల ఆసుపత్రిగా పేరొందినప్పటకీ ప్రస్తుతం  మూడు వందల పడకలు నిండుతున్నాయి. గతంలో నియమించిన సిబ్బందే నేటికీ విధులు నిర్వహిస్తున్నారు. కాలానుగుణంగా వైద్యులు, సిబ్బందిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటంతో సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. అవసరం మేర పోస్టుల భర్తీకి కృషి చేయాలని స్థానిక వైద్యాధికారులు  ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు