అమ్మా.. నీ వెంటే నేను

25 Apr, 2019 13:48 IST|Sakshi
ఎం. సుబ్బమ్మ, తల్లి వెంకటసుబ్బమ్మ, కుమార్తె

తల్లి అంత్యక్రియలు పూర్తయ్యేలోగా కుమార్తె మృతి

రామాంజనేయపురం ఎలక్ట్రికల్‌ కాలనీలో విషాదం

కడప కార్పొరేషన్‌: ఆ ఇంట శోకసంద్రం నెలకొంది. 24 గంటల వ్యవధిలో తల్లీ కూతుర్లు మరణించిన వైనం తీవ్ర విషాదం నింపింది. కుటుంబ సభ్యులను దిగ్బ్రమలో ముంచెత్తింది. కడప నగరం రామాంజనేయపురం ఎలక్ట్రికల్‌ కాలనీలో ఉంటున్న మాధు సుబ్బమ్మ(75) కొంతకాలం నుంచి వృద్ధాప్యపరమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. భర్త కొండారెడ్డి గతంలోనే చనిపోయాడు. ఈమెకు ముగ్గురు కుమారులు..ఒక కుమార్తె. వీరి కుటుంబం అట్లూరు మండలంలో వ్యవసాయం చేసేవారు. ముంపు బాధితులుగా కడప వచ్చేశారు. సుబ్బమ్మ కుమార్తె ఇంట్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం సుబ్బమ్మ చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులందరూ చేరుకున్నారు. బుధవారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. స్మశాన వాటిక నుంచి తిరిగి వచ్చేలోగా ఆ ఇంట మరో మరణం సంభవించింది. మృతురాలి కుమార్తె యండ్ల వెంకటసుబ్బమ్మ (50) ఉదయం 10–30గంటల ప్రాంతంలో ఆకస్మికంగా చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్‌ అయ్యారు. తల్లి మరణంతో కుంగిపోయిన వెంకట సుబ్బమ్మ వడదెబ్బకు గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు.  మృతురాలు వెంకటసుబ్బమ్మకు భర్త నాగిరెడ్డితోపాటు  కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒక రోజు తిరగకమునుపే ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ దు:ఖ సాగరంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు