విధి వంచితులు.!

27 Apr, 2018 11:45 IST|Sakshi
మూర్ఛవ్యాధితో కదలలేని స్థితిలో కొడుకు పుల్లయ్య, పక్షవాతంతో కదలలేక మంచానికే పరిమితమైన తల్లి సుబ్బమ్మ

వారు కడు నిరుపేదలు.. ఒకరు మూర్ఛ వ్యాధితో అల్లాడుతుంటే.. మరొకరు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు.. ఎవరైనా దయతలచి కాస్త అన్నం పెడితే వారు ఆకలి తీర్చుకుంటారు.. లేదంటే కడుపు మాడ్చుకోవాల్సిందే.. అత్యంత దుర్భరంగా బతుకీడుస్తూ.. మానవతా వాదుల చేయూత కోసం ఎదురు చూస్తున్న తల్లీబిడ్డల దీనగాధ ఇది.

అట్లూరు:అట్లూరు మండల పరిధిలోని మణ్యవారిపల్లి బీసీ కాలనీలో కత్తి సుబ్బమ్మ(70), కత్తి పుల్లయ్య(40) అనే తల్లీ కొడుకు నివాసముంటున్నారు. సుబ్బమ్మకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, కుమార్తెలతో పాటు ఒక కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు పుల్లయ్యకు మూర్ఛ వ్యాధితోపాటు బుద్ధి మాంద్యం కూడా ఉంది. దీంతో అతనికి పెళ్లి కూడా చేయలేదు. పుల్లయ్య బద్వేలు పట్టణంలో భిక్షాటన చేస్తూ  కాలం గడుపుతూ వారానికో.. లేదా నెలకో ఒకసారి తల్లి వద్దకు వచ్చి వెళ్లేవాడు. తల్లి సుబ్బమ్మ కూలీపనులు చేసుకుని జీవనం సాగించేది. ఆమెకు ఏడేళ్ల క్రితం పక్షవాతం సోకింది. ఫలితంగా ఒక కాలు, ఒక చేయి పనిచేయక పోవడంతో కదలలేక మంచానికే పరిమితమైంది. ఈ పరిస్థితిలో కుమారుడు కూడా తల్లి వద్దకే చేరుకున్నాడు. అయితే తలదాచుకునేందుకు వీరికి కనీసం గూడు కూడా లేకపోవడంతో పట్టలు కప్పిన ఓ చిన్న గుడారంలో వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ కనాకష్టంగా బతుకు వెళ్లదీస్తున్నారు.

ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు
అనారోగ్యంతో అడుగు ముందుకేయలేని స్థితిలో ఉన్న ఈ అభాగ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మానవతావాదులపై ఉంది. అర్హులైన వారికి వృద్ధాప్య.. వికలాంగ పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పుకునే పాలకులు ఇలాంటి వారి విషయంలో సానుకూలంగా స్పందించాలని పలువురు కోరుతున్నారు. అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు