అన్నవరంలో అమానుషం

11 Jun, 2019 09:30 IST|Sakshi

అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లల మృతి

భర్త, అత్తమామల వేధింపులే కారణం: మృతురాలి తండ్రి

అన్నవరం (ప్రత్తిపాడు): సత్యదేవుడు కొలువైన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. దేవస్థానం మొదటి ఘాట్‌రోడ్‌ దిగువన ఓ ఇంట్లో నివాసం ఉంటున్న ఓ వివాహిత, ఆమె ఇద్దరు చిన్నారులు సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి... అన్నవరంలోని జూనియర్‌ కళాశాల వెనుకనున్న ఇంట్లో నివాసం ఉంటున్న తాళ్లపురెడ్డి సుష్మ రాజ్యలక్ష్మి (26), ఆమె కుమారులు సాత్విక్‌ (ఐదు), రెండో కుమారుడు యువన్‌ (7 నెలలు) సోమవారం ఉదయం విగతజీవులుగా కనిపించారు. తాము ఇంట్లో లేని సమయంలో తమ కోడలు పిల్లలను చంపి, ఉరి వేసుకుని చనిపోయిందని మృతురాలి మామ చంద్రరావు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ కుమార్తెను భర్త, అత్త, మామలు తరుచూ వేధించేవారని, వారే పిల్లలను, తమ కుమార్తెను హత్య చేయడమో, లేక ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించడమో చేశారని రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

పండుగకు వెళ్లి వచ్చి...
సుష్మ రాజ్యలక్ష్మిది విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం కిత్తనాయుడుపాలెం గ్రామం. 2013 సంవత్సరంలో అన్నవరానికి చెందిన తాళ్లపురెడ్డి లోవ వెంకట రమేష్‌తో వివాహమైంది. వివాహ సమయంలో కట్న, కానుకలు కింద రూ.రెండు లక్షలు ఇచ్చినట్లు మృతురాలి తండ్రి కొరుప్రోలు పెదరాజబాబు తెలిపారు. అయితే వివాహమైనప్పటి నుంచి తన భర్త, అత్త మామలు, ఆడపడుచులు తరుచూ తనను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారంటూ తన కుమార్తె తరచూ చెప్పేదని తెలిపారు. గత నెలలో స్వగ్రామంలో జరిగిన పండుగకు తమ కుమార్తె పిల్లలతో పాటు వచ్చిందని, ఈ నెల ఆరో తేదీన తిరిగి అన్నవరం పంపించామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని రోధించారు. కాగా మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న చావు, హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్‌ఐ మురళీమోహన్‌ తెలిపారు. అత్త, మామ, భర్తలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్న బంధువులు
సుష్మరాజ్యలక్ష్మి, ఆమె పిల్లల చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకూ మృతదేహాలను పోస్టుమార్టానికి కదలనిచ్చేది లేదని మృతురాలు ఇంటివద్ద ఆమె బంధువులు బైఠాయించారు. మృత దేహాలను తరలించేందుకు వచ్చిన అంబులెన్స్‌ను కూడా అడ్డుకున్నారు. 

మరిన్ని వార్తలు