కుమార్తె వైద్యానికి సహకరించమని వేడుకోలు

13 Aug, 2018 13:06 IST|Sakshi
మాట్లాడుతున్న కానూరి కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు

అల్లిపురం(విశాఖ దక్షిణ): కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తెకు మెరుగైన వైద్యం అందించి జీవితాన్ని ప్రసాదించాలని నగరంలోని బర్మాక్యాంపునకు చెందిన ఆటో డ్రైవర్‌ కానూరి కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు దాతలను వేడుకొంటున్నారు. ఈ మేరకు ఆదివారం వీజేఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ 13 ఏళ్ల కుమార్తె కానూరి లతాశ్రీ కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని, మందులు, ఇతర వైద్య ఖర్చుల కోసం నెలకు రూ.15వేలకు పైగా అవుతోందని తెలిపారు. ఆటో నడుపుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తమకు కుమార్తెకు వైద్యం చేయించే స్థోమత లేకుండా పోయిందని తెలిపారు.

ఒక రోజు బాగుంటే రెండు రోజులు జ్వరంతో బాధపడుతోందని, మురళీనగర్‌లోని ఎంఎస్‌ఎం స్కూల్‌లో పనిచేస్తున్న మూర్తి మాస్టారి సహకారంతో చదివిస్తున్నామని తెలిపారు. ఇంత వరకు అప్పులు చేసి అమ్మాయికి వైద్యం చేయించామని, అయినప్పటికీ ఆరోగ్యం క్షీణిస్తోందని వాపోయారు. మెరుగైన వైద్యం కోసం దాతలు సహకరించి తమ కుమార్తెకు జీవితాన్ని ప్రసాదించాలని కోరుతున్నారు. సహాయం చేయదలచిన వారు తమ ఎస్‌బీఐ అకౌంట్‌ నంబరు 89769442309(ఐఎఫ్‌ఎస్‌డీ కోడ్‌ నంబరు. ఎస్‌బీఐఎన్‌ 0020573)  కానూరి కోటేశ్వరరావు(9010943730) నంబర్లో తెలియపరచగలరని కోరారు.

మరిన్ని వార్తలు