తల్లి జోలికి వచ్చారో..??

20 Feb, 2014 01:01 IST|Sakshi
తల్లి జోలికి వచ్చారో..??
  •     మోదకొండమ్మ ఆలయం అప్పగింతపై నిరసన
  •      రాజకీయాలకు అతీతంగా నేడు బంద్‌కు పిలుపు
  •      బాలరాజు తీరును ఎండగడుతున్న భక్తులు
  •  పాడేరు, న్యూస్‌లైన్ : పాడేరులోని మోదకొండమ్మ ఆలయా న్ని దేవాదాయ శాఖ పరిధిలో చేర్చడాన్ని భక్తులు, రాజకీయ, వర్తక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏళ్లనాటి నుంచీ అమ్మవారి ఆలయాన్ని తాము కాపాడుకుంటూ వస్తున్నామని, అసలు గుడిపై ఏ హక్కు ఉందని మంత్రి బాలరాజు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
     
    ఈ మేరకు గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం అమ్మవారి ఆలయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, పాడేరు గ్రామ పెద్దలు, వర్తక సంఘం నేతలు సమావేశమయ్యారు. వీరంతా బాలరాజు నిరంకుశ విధానాలను ఎండగట్టారు. ఆలయ అభివృద్ధ్దికి పైసా కూడా ఖర్చుపెట్టని వ్యక్తి పదవి ముగుస్తున్న సమయంలో దాన్ని దేవాదాయ శాఖకు అప్పగించడాన్ని తప్పుబట్టారు.

    మాజీ మంత్రి ఎం.మణికుమారి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వంజంగి కాంతమ్మ, బీజేపీ నేత కురుసా బొజ్జయ్య, సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, వర్తక సంఘం అధ్యక్షులు రొబ్బి శంకరరావు, టీడీపీ నేతలు బొర్రా నాగరాజు, విజయరాణి, కొట్టగుల్లి సుబ్బారావు, రొబ్బి రాముల ఆధ్వర్యంలో సమావేశమై ఆలయాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిన బూనారు.

    మణికుమారి మాట్లాడుతూ ఆలయ కమిటీ, ధర్మకర్తలు, వర్తక సంఘం, గ్రామ పెద్దలంతా అమ్మవారి ఆలయానికి కృషి చేస్తే ఎక్కడ నుంచో వచ్చిన మంత్రి  పెత్తనం చెలాయించడం దారుణమన్నారు. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాలరాజు చర్యలను ప్రతీ ఒక్కరూ అడ్డుకోవాలన్నారు. వంజంగి కాంతమ్మ మాట్లాడుతూ మోదకొండమ్మతల్లి ఆలయం మంత్రి బాలరాజుకు సొత్తు కాదన్నారు.
     
    నేడు బంద్

    ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించడాన్ని నిరసిస్తూ గురువారం పాడేరు పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆలయాన్ని యథావిధిగా భక్తుల ఆధీనంలోనే ఉంచే వరకు పోరాడతామని నేతలు స్పష్టం చేశారు.  విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు నవర గోవిందరావు, బి.కెజియారాణి,  పూసర్ల గోపి,  నిక్కుల సింహాచలం, వెల్డింగ్ శ్రీను, లకే రత్నాభాయి పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు