ఎంత పని చేశావు తల్లీ..

12 Jan, 2019 13:16 IST|Sakshi
నాగజ్యోతి, సునీత

కుమార్తెను కాలువలోకి విసిరేసి..తనూ దూకిన తల్లి

కుమార్తె మృతి.. తల్లికి స్వల్ప గాయాలు

నన్నూరులో ఘటన కుటుంబ కలహాలే కారణం

కర్నూలు, ఓర్వకల్లు:  ముక్కుపచ్చలారని చిన్నారి.. అభం శుభం తెలియదు.. 18 నెలలైనా నిండనే లేదు.. ఎంతో భవిష్యత్‌ ఉన్న ఆ చిన్నారి.. తల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి బలైపోయింది.కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తను చనిపోతే కుమార్తెకు దిక్కెవరన్న బెంగతో ఆ చిన్నారిని కూడా తీసుకుపోవాలనుకుంది. ముందుగా కుమార్తెను హంద్రీ–నీవా కాలువలోకి విసిరేసింది. తర్వాత తనూ దూకింది. కుమార్తె చనిపోగా.. ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ విషాదకర ఘటన ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. తెలంగాణలోని అలంపూర్‌ మండలం ర్యాలెంపాడు గ్రామానికి చెందిన నాగజ్యోతిని ఆరేళ్ల క్రితం నన్నూరుకు చెందిన కురువ శివకుమార్‌కిచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు పవన్, కుమార్తె సునీత (18 నెలలు) సంతానం.

శివకుమార్‌ పెళ్లయిన కొంత కాలం వరకు కర్నూలులో పెయింటర్‌గా పనిచేశాడు. పిల్లలు పుట్టిన తర్వాత పెయింటింగ్‌ వృత్తిని మానుకున్నాడు. భార్యాభర్త ఇద్దరూ శివకుమార్‌ తల్లిదండ్రుల వద్దనే ఉంటూ ఊళ్లో వ్యవసాయ పనులకు వెళ్లేవారు. అయితే..అత్తమామలు, కోడలు మధ్య కొద్ది రోజుల నుంచి కుటుంబ కలహాలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం శివకుమార్‌ శనగ కోత పనులకు వెళ్లాడు. నాగజ్యోతి కుమారుడు పవన్‌ను స్థానికంగా ప్రైవేట్‌ పాఠశాలలో వదిలిపెట్టి, కూతురును తీసుకొని ఆటోలో పుట్టింటికని బయలు దేరింది.అయితే.. నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని హంద్రీ–నీవా బ్రిడ్జి వద్ద దిగింది. కాలువ గట్టుకు చేరుకొని మొదట కుమార్తెను కాలువలోకి విసిరింది. ఆ వెంటనే తను కూడా నీటిలోకి దూకింది. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి తల్లీ కూతురును బయటకు తీశారు. చికిత్స కోసం ఆటోలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి సునీత అప్పటికే చనిపోయింది. కాలువలో తక్కువ లోతులో నీళ్లు ఉండడంతో నాగజ్యోతి స్వల్ప గాయాలతో బయటపడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె అత్తమామలపై  కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు