మాతృదేవతా మన్నించు! 

22 Jun, 2020 06:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏడుగురు సంతానం ఉన్నా అనాౖథెన అమ్మ 

అనాథాశ్రమంలో చేర్పించిన కొడుకులు 

నిరాదరణ, ఒంటరితనం భరించలేక ఆత్మహత్యాయత్నం 

చికిత్స పొందుతూ మృతి 

అందరినీ కనే శక్తి అమ్మకే ఉంది.. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అన్నాడో సినీ కవి. జన్మనిచ్చిన అమ్మను మించిన గురువు, దైవం మరొకరు లేరంటారు. సృష్టిలో అమ్మకే తొలి ప్రాధాన్యం. కడుపున పుట్టిన ఏడుగురు సంతానం ఆ తల్లిని భారంగా భావించారు. అందరూ ఉండి అనాథాశ్రమంలో చేర్పించారు. 90 ఏళ్ల ముదిమి వయసులో నిరాదరణ, ఒంటరితనాన్ని భరించలేని ఆ అమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలుస్తోంది. 

సాక్షి, చిత్తూరు‌: గుడిపాలకు చెందిన పాపమ్మ (90)కు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరినీ ఆమె ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేసింది. వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు ఆర్థికంగా బాగా నే నిలదొక్కుకున్నారు. తల్లికి వయసు పెరగడంతో భారంగా భావించారు. దగ్గరుండి మరీ చిత్తూరు నగరంలోని తపోవనం అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పుడ ప్పుడూ కనీసం పలకరించకుండా మొహం చాటేశారు. కాటికి కాళ్లు చాపే ఈ వయసు లో తన బిడ్డలెవరూ దగ్గరలేరనే ఆవేదన చెందింది. చదవండి: ఈ జనానికి ఏమైంది..? 

ఈనెల 18న బాగా నీరశించడంతో ఆశ్రమ నిర్వాహకులు ఆమెకు గ్లూకోజ్‌ ద్రావణం ఇచ్చారు. జీవితంపై విరక్తి చెందిన ఆమె మరుగుదొడ్డిలో ఉన్న యాసిడ్‌ను గ్లూకోజ్‌లో కలుపుకుని తాగేసింది. గమనించిన నిర్వాహకులు ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు వృద్ధురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఏడుగురు సంతానం ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదని స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు