మా అత్తమ్మ

26 Oct, 2014 03:14 IST|Sakshi
మా అత్తమ్మ

సినిమాల్లో గయ్యాళిగా కనిపించే అత్త పాత్రలను చూసి సమాజంలో అత్తలు అందరూ గయ్యాళులుగా ఉంటారని అనుకోవడం అవివేకమే. సినిమా వేరు, నిజ జీవితం వేరు. కోడళ్లను కన్న కూతుళ్లలా చూసుకుంటూ అత్తా ఒకింటి కోడలే అన్న నానుడిని నిజం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వయసు పైబడినా కోడళ్లకు చిన్న పని కూడా చెప్పకుండా వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ అమ్మను మరిపించే అత్తలు ఎందరో. ‘అత్త’ల దినోత్సవం సందర్భంగా కొందరు కోడళ్ల అనుభవాలు ఇవీ!        
 -సాక్షి నెట్‌వర్క్
 
పెళ్లికి ముందు ఫ్రెండ్.. తరువాత ఫ్యాన్  

మా అత్త షన్భగం పెళ్లికి ముందు ఫ్రెండ్‌గా ఉండేవారు. సినిమా షూటింగ్ సమయాల్లో మా అమ్మతోపాటు అత్తయ్య కూడా పాల్గొనేవారు. ఫ్రెండ్‌లా వ్యవహరిస్తూ సలహాలిచ్చేవారు. సెల్వమణితో ప్రేమ వివాహం తరువాత అత్తయ్య నాకు పెద్ద ఫ్యాన్‌గా మారిపోయారు. నేను నటించిన సినిమాలు, ఇతర ప్రోగ్రామ్స్‌ను తప్పకుండా చూస్తుంటారు. నా నటన అంటే అత్తకు అభిమానం. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. అయితే ప్రేమ వివాహం తరువాత నన్ను ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయలేదు. నా పిల్లలిద్దర్నీ అత్తతో పాటు వదిన సరస్వతీ ఎంతో చక్కగా చూసుకుంటారు. నేను సినిమారంగం, రాజకీయ రంగం పట్ల బిజీగా ఉంటున్న విషయాల్ని అత్త బాగా అర్థం చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినపుడు అత్తయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సంఘటన మరువలేను. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్యపరమైన సమస్య ఉండడంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారరానికి రాలేకపోయారు. అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ నేను గెలవాలని ప్రత్యేక పూజలు చేయించేవారు. గెలుపు అనంతరం ఆమె ఎంతో ఆనందంతో మొక్కు తీర్చుకున్నారు. అత్తగారితో ఉండే అన్యోన్యత, అనుబంధం, ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.  
- ఆర్కే.రోజా, నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే
 
కూతురుకన్నా మిన్నగా చూస్తోంది
 
నా భర్త పేరు చంద్రప్రకాష్. మా అత్త పేరు పద్మావతి. ఆమెకు 76 ఏళ్లు. నాకు 1990లో పెళ్లయింది. మా మామ నాకు పెళ్లికాకముందే చనిపోయారు. నాకు పెళ్లయినప్పటి నుంచీ అత్తతో ఎలాంటి సమస్యా లేదు. ఇప్పటి వరకు అత్తతో చిన్నపాటి గొడవా రాలేదు. మామూలుగా అందరూ భర్త తల్లిని అత్త అనే పిలుస్తుంటారు. కానీ నేను మాత్రం అమ్మ అనే పిలుస్తున్నాను. ఆమె కూడా నన్ను అమ్మా అనే సంబోధిస్తుందే తప్ప పేరుపెట్టి  పిలవడం కానీ, ఏకవచనంతో పిలవడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. నాకు నాన్నలేడు. అమ్మ ఉన్నా పుత్తూరు మండలం వేపగుంట గ్రామంలో ఉంటోంది. ఎక్కడో దూరంగా పల్లెలో ఉన్నా పెళ్లయిన తర్వాత అమ్మను మరిచిపోయే విధంగా మా అత్త నన్ను చూసుకుంటోంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉంది. మేము కూడా వీలుదొరికినప్పుడల్లా బెంగళూరుకు వెళ్లి వస్తుంటాం. భవిష్యత్తులో కూడా ఎలాంటి మనస్పర్థలూ ఏర్పడకుండా ప్రస్తుతమున్న తల్లీకూతుళ్ల బంధం కడదాకా ఉండేటట్లు ఆశీర్వదించమని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.                        
- గీర్వాణి, జెడ్పీ చైర్‌పర్సన్
 
నా ఉన్నతికి కారణం

పలమనేరు రూరల్: ‘మా అత్త నాకు అమ్మలాంటిది. నేను అత్తారింట్లో ఉన్నా పుట్టింట్లో ఉన్నట్టే ఉంటుంది. నేనీవాళ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానంటే మా అత్తయ్య ప్రోత్సాహమే కారణం’ అంటోంది పలమనేరు మండలం రామాపురానికి చెందిన వాసవి. రామచంద్రనాయుడు కుమార్తె వాసవితో పెనుమూరు మండలం కంబాలమిట్టకు చెందిన సరస్వతి, సుబ్రమణ్యం కుమారుడు నాదేళ్ల కుమార్‌తో గతేడాది పెళ్లైంది. భర్త కుమార్ ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వాసవి అత్తమామలది ఉమ్మడి కుటుంబం. పెళ్లయిన తర్వాత అప్పగింతల సమయంలో వాసవి కన్నీళ్లు తుడిచి అత్త అక్కున చేర్చుకోవడంతో ఆమెకు ధైర్యం వచ్చింది. కోడలికి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాగానే ప్రోత్సాహమిచ్చి ఉద్యోగం చేసేలా చూసింది. తన కొడుకును సైతం కోడలితో పాటు పంపి అక్కడే కాపురం పెట్టించింది. ప్రతిరోజూ అత్తాకోడళ్లిద్దరూ ఫోన్‌లో బాగోగులు తెలుసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అత్తారింటికి కోడలు వచ్చినపుడు అన్నీ పనులు అత్తే చేస్తూ కోడలిని బాధపెట్టనివ్వకుండా చూసుకుంటోంది. కోడలు సైతం అత్త మనసును నొప్పించకుండా ఆమెకు సాయంగా ఉంటూ ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. తనకు అత్త తల్లిలాగే అనిపిస్తుందని వాసవి చెబుతోంది.
- వాసవి
 
ఆమె ఓపికకు హ్యాట్సాఫ్


మా అత్త సరోజమ్మ నన్ను కన్న కూతురిలా చూసుకుంటోంది. అత్త, అమ్మ రెండూ ఆవిడే. వాస్తవానికి నన్ను కోడలిని చేసుకోవడం మా అత్తకు ఇష్టం లేదు. తన తమ్ముడి కూతురిని ఇంటి కోడలు చేసుకోవాలనేది ఆమె ఆలోచన. ఈ నేపథ్యంలో నా పెళ్లి జరిగినందున మొదట్లో అత్త ఎలాంటి ఇబ్బందులు పెడుతుందోన ని భయపడేదాన్ని. నేను ఊహించినట్లే కొన్నాళ్లు ఆమె మాటలు నా మనసును బాధించాయి. నేను కర్నూలులో పీజీ చేస్తున్నపుడు నా ఏడాది వయసు తొలి బిడ్డను తిరుపతిలో తనవద్ద ఉంచుకొని అక్కరగా చూసుకుంది. నా ఉన్నత చదువులకు, ఉద్యోగానికి ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. ఇప్పటికీ మా పిల్లలకు కావాల్సినవి అన్నీ ఆమే చూస్తుంది. వయసు పైబడినా నోములు, వ్రతాలు పండుగలు నిష్టగా చేస్తుంది. సంప్రదాయాలను బాగా గౌరవిస్తుంది. పండుగల పద్ధతులు, వంటలు ఎలా చేయాలో ఆమె దగ్గరే నేర్చుకున్నాను. మాది ఉమ్మడి కుటుంబం. కుటుంబంలో అందరినీ సమానంగా ఆదరిస్తుంది. మానసిక స్ధితి సరిగా లేని తన కూతురికి ఓపికగా ఆమె చేస్తున్న సేవలు నిరుపమానమైనవి. ఆమె ఓపికకు హ్యాట్సాఫ్.    
- డాక్టర్ కృష్ణప్రశాంతి, జనరల్ ఫిజీషియన్
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా