అమ్మా.. నేను సేఫ్‌

10 Mar, 2020 11:51 IST|Sakshi

పసికందును బ్యాగులో ఉంచి వదిలేసి వెళ్లిన ఓ మహిళ

ఏడుపులు విని రక్షించిన వాకర్స్‌

పిల్లలు కావాలని ఎందరో దేవుళ్లను మొక్కుకుంటారు. వ్రతాలు, నోములు చేస్తారు.  డాక్టర్లకు చూపించుకుని వేలాది రూపాయలు ఖర్చు చేస్తారు. అయినా, కడుపు పండలేదని..అమ్మా అనిపించుకోలేదని కుంగిపోతుంటారు. కొందరు ఈ బాధతో  లోకాన్నే వదిలివెళ్తారు. అంతటి బలీయమైన ఈ పేగు బంధాన్ని తెంపుçకుని వెళ్లింది ఓ కసాయి తల్లి. ఆడబిడ్డ పుట్టిందనో, మరేతర కారణమో తెలియదు కానీ ఆదోనిలో జరిగిన ఈసంఘటన తల్లిప్రేమకు మాయని మచ్చగా నిలుస్తోంది.

కర్నూలు, ఆదోని టౌన్‌:   ఆదోని పట్టణంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల క్రీడామైదానంలో ఉన్న వేపచెట్టు కింద  ఓ పసికందును బ్యాగులో పెట్టి వదిలేసి వెళ్లారు. రోజులాగే సోమవారం ఉదయం ఈ మైదానంలో వాకింగ్‌కు వచ్చిన వారికి పసిబిడ్డ ఏడుపులు వినిపించాయి. ఎక్కడి నుంచి ఈ ఏడుపులు వస్తున్నాయని అటూఇటూ  చూశారు.  బ్యాగులో నుంచి రోదనలు వినిపించడంతో వెళ్లి చూశారు. వెంటనే అందులోని  పసిబిడ్డను బయటకు తీసి పరిశీలించి స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.  తర్వాత త్రీ టౌన్‌ పోలీసులు, అంగన్‌ వాడీ ప్రాజెక్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్న అధికారులు పసికందుకు వైద్యం అందించారు. ఆరోగ్యంగా ఉండటంతో కర్నూలులోని ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ హోమ్‌కు 108 అంబులెన్స్‌లో  తరలించినట్లు  సూపర్‌వైజర్‌ సావిత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు