పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ..

17 Dec, 2017 09:11 IST|Sakshi

జన్మనిచ్చి వదిలి వెళ్లిన కసాయి తల్లి 

అక్కున చేర్చుకున్న స్థానిక మహిళలు

 మాతా శిశు కేంద్రానికి తరలింపు

నిడదవోలు :  నవ మాసాలు మోసిన తల్లి అందమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అంతలోనే కసాయిగా మారింది. మాతృత్వం మంట కలిసిన వేళ... స్త్రీ తన హృదయాన్ని బండరాయిగా చేసుకుని అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పాడుబడ్డ ఇంట్లో ఎవరూ లేని సమయంలో వదిలి వెళ్లిన సన్నివేశం మానవత్వం ఉన్న మనుషులను కలచివేసింది. తల్లి గర్భం నుంచి అప్పుడే ప్రపంచాన్ని చూసిన ఆ బిడ్డ కేర్‌ కేర్‌ మని ఏడుస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు సరికదా రక్త సంబంధాన్ని కూడా నిర్ధాక్షిణ్యంగా తెంచుకుని వెళ్లిపోయింది. నిడదవోలు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం వెనుక భాగంలో ఉన్న పాడుబడ్డ పెంకుటింట్లో శనివారం ఉదయం గుర్తు తెలియని మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఇంట్లో గత కొంత కాలంగా ఎవరూ నివాసం ఉండటం లేదు. ఈ మహిళ ఎప్పుడు వచ్చిందో.. ఏం కష్టం వచ్చిందో తెలియదు. పురిటి నొప్పులను మౌనంగా భరిస్తూ ఎవరూ లేని సమయంలో గోనె సంచిపై అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

 సమాజం తనని వేలెత్తి ప్రశ్నిస్తుందని భయపడిందో లేక ఆడబిడ్డ ఎందుకని భావించిందో ఏమో తెలియదు కానీ బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న  బిడ్డను దోమలు, చీమలు కుట్టసాగాయి. దీంతో బిడ్డ బాధను భరించలేక కేర్‌ కేర్‌ మని ఏడవసాగింది. ఉదయం 9 గంటల సమయంలో పాడు బడ్డ ఇంట్లో నుంచి బిడ్డ ఏడుపు వినిపించడంతో సీతామహలక్ష్మి అనే మహిళతో పాటు స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బిడ్డ గోనె సంచిపై పడిఉంది. శిశువు పేగు కూడా తీయలేదు. మహిళలు ఈ బిడ్డను ఇంటికి తీసుకువెళ్ళి పేగు కోసి స్నానం చేయించారు. బిడ్డకు గాయాలు కావడంతో కొద్దిగా పౌడర్‌ అద్ది స్థానిక చిన్న పిల్లల ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

 విషయం తెలుసుకున్న పట్ట ణ ఎస్సై జి.సతీష్‌ అక్కడ వచ్చి బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యాధికారి ఏవీఆర్‌ఎస్‌ తాతారావు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్య సేవలకు గాను 108 వాహనంలో ఏలూరు ఏరి యా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఐసీడీఎస్‌ అధికారులు ఏలూరు మతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉందని, ఇన్‌ఫెక్షన్‌ కారణంగా శరీరంపై దద్దర్లు వచ్చాయని వైద్యులు పేర్కొన్నారు. పట్టణ ఎస్సై జి.సతీష్‌ 317 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు