అమ్మపాలే అమృతం!

1 Aug, 2018 11:33 IST|Sakshi

బిడ్డకు పాలిస్తే తల్లికీ ఆరోగ్యం

చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి మెరుగు

నేటి నుంచి తల్లిపాల     వారోత్సవాలకు ఐసీడీఎస్‌ సిద్ధం

తల్లిపాలే పిల్లలకు అమృత తుల్యం. బిడ్డ శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. నవజాత శిశువుకు బలం చేకూర్చే ఆహారం తల్లిపాలేనని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే, ఈ విషయం తెలిసినా చాలా మంది ముర్రుపాలు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. అపనమ్మకం, అభద్రతా భావం కారణం ఏదైతేనేం బిడ్డకు పాలు అందించేందుకు అయిష్టత చూపుతున్నారు. ఫలితంగా పిల్లల్లో రోగనిరోధకశక్తి తగ్గి భవిష్యత్తులో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తల్లి పాల ఆవశ్యకతను తెలుపుతూ ప్రభుత్వం ఏటా వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐసీడీఎస్‌ శాఖ నేటి నుంచి 7వ తేదీ వరకు వారోత్సవాలను చేపట్టనుంది. దీనిపై ప్రత్యేక కథనం.

చిత్తూరు రూరల్‌:  జిల్లా వ్యాప్తంగా 1,95,362 మంది చిన్నారులు ఉండగా.. 10,108 మంది పోషకాహార లోపంతో ఇబ్బందిపడుతున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, పుట్టిన బిడ్డకు తల్లి పాలు అందించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. బిడ్డ పుట్టిన వెంటనే 70 శాతం మంది తల్లులు బిడ్డలకు ముర్రుపాలు అందిస్తుండగా, కేవలం 30 శాతం మంది మా త్రమే ఆరు నెలల పాటు పాలు పడుతున్నారని అధికారులు చెబుతున్నారు.

మొదటి రెండు రోజులు కీలకం..
బిడ్డ పుట్టిన మొదటి రెండు రోజులు ఎంతో కీలకమని వైద్యనిపుణులు చెబుతున్నారు. పుట్టిన కొద్దిసేపటికే ముర్రుపాలు తాగేలా చూడాలి. ఈ రోజుల్లో ఇచ్చే పాలల్లో కొలెస్ట్రాల్‌ ఉంటుంది. ఇందులో రోగ నిరోధకశక్తి పెంచే అంశాలు ఉం టాయి. బిడ్డ పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఎంతగానో దోహదపడుతుంది. దీంతో పాటు ఆరు నెలల వరకు తల్లిపాలను మాత్రమే అందించాలి. తర్వాత మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన ప్రోటీన్లు, పోషకాలు, మాంసకృత్తులు, పిండి పదార్థాలన్నీ సమత్యులంగా తల్లిపాలల్లో లభిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఆరు నెలల వరకు తల్లిపాలనే పట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తోంది.

తల్లికీ పోషకాలు అవసరం
ప్రసవం తరువాత బాలింతలు తీసుకునే ఆహారం కూడా పోషక విలువలు కలిగి ఉండాలని వైద్యులు చెబుతున్నారు. తల్లి పోషకాహారం తీసుకుంటే బిడ్డకు కూడా అలాంటి ఆహారాన్ని అందించేందుకు అవకాశం ఉంటుంది. రోజూ 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల పప్పు, 150 గ్రాముల కూరలు, ఉడకబెట్టిన గుడ్డు, ఓ పండు, 100 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. ప్రతి రోజూ ఆహారంలో పప్పు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

వారం రోజుల పాటు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. తల్లిపాలు బిడ్డకు అందించడం ద్వారా ఎలాంటి లాభాలు చేకూరతాయనే అంశంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తాం.      – ఉషా ఫణికర్, ఐసీడీఎస్‌ పీడీ

తల్లి పాలే బిడ్డకు శ్రీ రామరక్ష
ప్రసవం జరిగిన రెండు గంటల్లోగా తల్లిపాలను బిడ్డకు అందించాలి. ఆరు నెలల పాటూ అందిస్తూ ఉండాలి. చాలా మంది అవగాహన లోపంతో ప్రసవం తర్వాత ఇవ్వడం లేదు. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపైన, ఆరోగ్యంపైన భవిష్యత్తులో ప్రభావం పడుతుంది.    – సరళమ్మ, డీసీహెచ్‌ఎస్‌

ప్రయోజనాలు ఇలా..
పోతపాలు తాగే వారితో పోలిస్తే తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్‌ వంటి వ్యాధులు తక్కువని పలు పరిశోధనల్లో తేలింది.
రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. ఎముకల పుష్టి బాగుంటుంది.
కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే శాతం తక్కువ. మానసిక రుగ్మతలూ దూరమవుతాయని వైద్యునిపుణులు చెబుతున్నారు.
పాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది.
కాన్పు తరువాత వచ్చే కొన్ని రకాల మానసిక వ్యాధులు తల్లి దరిచేరవు.
బిడ్డకు పాలిచ్చే స్త్రీలో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్‌ ముప్పు తక్కువగా ఉంటుంది.

మరిన్ని వార్తలు