విద్యుదాఘాతంతో తల్లీకూతుళ్ల దుర్మరణం

19 May, 2016 02:03 IST|Sakshi

కాకినాడ సిటీ : విద్యుదాఘాతంతో తల్లీకూతుళ్లు మరణించిన విషాద సంఘటన బుధవారం కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సినిమా రోడ్డులోని గాంధీబొమ్మ సెంటర్ సమీపంలో ఆనాల హంసరత్నం(70)తో ఆమె చిన్న కుమార్తె వెంకటలక్ష్మి ప్రసన్న(40) కలిసి ఉంటోంది. హంసరత్నం పెద్ద కుమార్తె మణికుమారి, అల్లుడు సూరపురెడ్డి వీరవెంకట గంగాధర నాగభూషణం నగరంలోనే వేరే చోట నివసిస్తున్నారు.
 
 చిన్న కుమార్తె ప్రసన్న తన భర్త నుంచి విడిపోయి తల్లి వద్దే ఉంటోంది. ఇలాఉండగా బాల్కనీలోకి వెళ్లిన హంసరత్నం దుస్తులు వేసే తీగకు తగిలి, విద్యుదాఘాతానికి గురైంది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కుమార్తె ప్రసన్న కూడా విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే చనిపోయారు. ఇంటి ఎదురుగా అద్దెకుంటున్న గణపాల మహాలక్ష్మి ఎప్పటిలాగే పువ్వులు ఇచ్చేందుకు ఉదయం 9 గంటల ప్రాంతంలో వెళ్లగా, తల్లీకూతుళ్లు చలనం లేకుండా పడిఉండడాన్ని గమనించింది. ఈ విషయాన్ని హంసరత్నం పెద్ద కుమార్తెకు సమాచారమిచ్చింది. డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. టూటౌన్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై కె.సత్యనారాయణ మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు