కట్నం అడిగారు.. జైలుకెళ్లారు..

11 Apr, 2017 12:22 IST|Sakshi

తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): వరకట్నం కేసులో తణుకు కోర్టు తల్లీకొడుకులకు జైలు శిక్ష విధించింది. అదనపు కట్నం తీసుకురమ్మని, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారనే ఆరోపణలు రుజువు కావడంతో తల్లి, కొడుకులకు ఆర్నెల్లుపాటు జైలుశిక్ష విధిస్తూ తణుకు కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం తణుకు పట్టణానికి చెందిన తిరుబిల్లి రేఖరోహిణి బెంగళూరు పట్టణంలోని హౌరమావు గ్రామానికి చెందిన జోసఫ్‌ రాజేష్‌లకు ఆరేళ్లక్రితం వివాహం అయ్యింది.

కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తుండటంతో రేఖరోహిణి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏఎస్సై ఆర్‌.బెన్నిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాధితురాలి భర్త జోసఫ్‌ రాజేష్, అత్త జోసఫ్‌ సెలీనాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో వాదోపవాదాలు అనంతరం తణుకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.శేషయ్య జోసఫ్‌ రాజేష్, జోసఫ్‌ సెలీనాలకు అర్నెల్లు జైలుశిక్షతోపాటు ఒకొక్కరికి రూ. 500 చొప్పున జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పుచెప్పారు.

మరిన్ని వార్తలు