కన్నబిడ్డలే.. కాదు పొమ్మన్నారు!

10 Sep, 2019 07:42 IST|Sakshi
కొడుకులు చేయి విరగ్గొట్టారంటూ కన్నీరు పెట్టుకుంటున్న ఉన్నీసా

పిచ్చిదానిగా ముద్ర వేసి ఇష్టానుసారంగా కొట్టారు

‘స్పందన’లో  ఓ వృద్ధురాలి ఆక్రందన

సాక్షి, మచిలీపట్నం: తల్లి పేరిట ఆస్తి ఉన్నన్నాళ్లు ఆమెను బాగానే చూసుకున్నారు.. ఆస్తిని తమ పేర్న రాయించుకున్నాక చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. తీవ్రంగా కొట్టడమే కాదు.. పిచ్చిదానిగా ముద్ర వేసి ఇంటి నుంచి గెంటేశారు. ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేయండయ్యా అంటూ సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకుందా వృద్ధురాలు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన ఖైరా ఉన్నీసా.. ఐదేళ్ల పాటు వార్డు సభ్యురాలిగా పనిచేసి తమ ప్రాంత ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంది. వారికి ఏ లోటూ రాకుండా సేవలందించింది. భర్త మృతి చెందడంతో తన ముగ్గురు కుమారులు, కుమార్తెను పెంచి పెద్ద చేసింది.

ఓ కుమారుడు పోలీస్‌ కానిస్టేబుల్‌ కాగా, మరో కుమారుడు బ్యాంకు కొలువు సంపాదించాడు. మూడో కుమారుడితో గ్రామంలోనే ఓ అంగడి పెట్టించింది. వారికి పెళ్లిళ్లు కూడా చేసింది. ఆమె పేరిట ఆస్తులున్నన్నాళ్లూ తల్లిని బాగానే చూసుకున్నారు. నెమ్మదిగా వాటిని తమ పేర్న రాయించుకుని.. ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. అదేంటని ప్రశ్నిస్తే.. ఇష్టమొచ్చినట్టు కొట్టడమే కాకుండా ఆమెకు పిచ్చి పట్టిందంటూ ప్రచారం చేశారు. గడిచిన ఎనిమిది నెలలుగా కుమార్తె ఇంట ఆ వృద్ధురాలు తలదాచుకుంటోంది. కుమార్తె కుటుంబ పరిస్థితీ అంతంత మాత్రం కావడంతో కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌కు తన గోడు చెప్పుకొంది. తన బిడ్డలే తన చావు కోరుకుంటున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కష్టాలు విన్న కలెక్టర్‌.. వెంటనే ఆమె కుమారుల్ని పిలిపించి, న్యాయం జరిగేట్టు చూడాలని వికలాంగ సంక్షేమశాఖ ఏడీని ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు