అమ్మా! ‘కని’కరించు..

25 Jan, 2014 01:59 IST|Sakshi

ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ :  మానవత్వం మంటగలుస్తోంది. ఆడపిల్ల పుట్టగానే వదిలించుకుంటున్నారు. జన్మనిచ్చే ‘అమ్మ’నే ఆమడదూరంలో పడేస్తున్నారు. బొడ్డుపేగు తెగక ముందే అనాథలుగా మారుస్తున్నారు. కళ్లు తెరవక ముందే మాతృప్రేమను పంచకుండా చెత్తకుప్పలు, ఆస్పత్రుల ఆవరణలు, రైల్వే, బస్‌స్టేషన్‌లలో వదిలేస్తున్నారు. కొందరు శిశువులు ఎక్కిఎక్కి ఏడ్చి కన్ను మూస్తున్నారు.. మరికొందరిని శునకాలు, వరాహాలు పిక్కుతింటున్నాయి.. భూమిపై నూకలు ఉన్నవారు అదృష్టవశాత్తు దొరుకుతున్నారు.

ఇదిలా ఉండగా, కొందరు తల్లిదండ్రులు ఆర్థికభారంతో తిండి పెట్టలేక, పెంచే స్థోమత లేక తమ పిల్లలను బస్, రైల్వేస్టేషన్, దేవాలయాల వద్ద వదిలేస్తున్నారు. ఇందులోనూ ఆడ శిశువులే అధికం. వీరిని అధికారులు శిశువిహార్‌లకు తరలిస్తున్నారు. గత మూడేళ్లలో జిల్లాలో 14 మంది శిశులు దొరుకగా ఇందులో ఎనిమిది మంది ఆడ శిశువులే ఉండటం దురదృష్టకరం. ఇంకా 32 మంది శిశువు మృతదేహాలు లభ్యమయ్యాయి.

 ఎందుకీ దుస్థితి..
 ప్రధానంగా వివాహేతర సంబంధాలు, పెళ్లి కాకుండానే తల్లులు అవడం, ఆధునిక పోకడల పేరిట డేటింగ్ చేయడం, ప్రేమపేరుతో శారీరక అవసరాలు తీర్చుకోవడం చెప్పుకోవచ్చు. ఇలా పుట్టిన బిడ్డలతో సమాజంలో పరువుపోతుందని, తల్లిదండ్రులు మందలిస్తారని చంటి పిల్లలను పడేస్తున్నారు. ఇటువంటి ఘటనలకు కారణమెవరు? సమాజమా? పేదరికమా? తెలిసి తెలియని వయసులో తప్పు చేస్తున్న యువతదా? ఎవరిది తప్పయిన శిక్ష అనుభవిస్తున్నది మాత్రం ముక్క పచ్చలారని చిన్నారులే.

 వీరిని అనాథలుగానైనా బతకనివ్వండి. శిశుగృహాలకు అప్పగించండి. అక్కడైనా బతుకుతారు. అన్ని రకాల వసతి, రక్షణ కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తారు. ఒక వేళ పిల్లలు లేనివారు పెంచుకుంటామని వస్తే దత్తత ఇస్తారు. ఆ విధంగానైనా బిడ్డలు బతుకుతారు.

 ఆడపిల్ల ‘లక్ష్మీదేవి’తో సమానం..
 ఆడపిల్ల పుడితే చాలామంది లక్ష్మీదేవి పుట్టిందంటారు. ఇది అన్నిచోట్ల కాదు. నేటికి చాలా మంది తమకు పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిసి గర్భంలోనే చిదిమేస్తున్నారు. ఆ సమయం మించిపోతే పుట్టిన వెంటనే వదిలించుకుంటున్నారు. చాలా మందికి సంతానం లేక మానసికంగా కుంగిపోతుంటారు. తమకు పిల్లలు కలగాలని వెళ్లని ఆస్పత్రి, మొక్కని దేవుళ్లు ఉండరు. సంతానం లేని వారు అయ్యో తమకు పిల్లలు కలగడం లేదనే ఆవేదన పడుతుంటే మరికొందరు ఇలా పుట్టిన బిడ్డలను రోడ్డుమీద పడేయడంపై బాధాకరం. మీకు అవసరం లేకపోతే చైల్డ్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేయండి.

 ఫిర్యాదు చేయవచ్చు..
 చెత్తకుప్పలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌ల వద్ద పిల్లలను వదిలేసి వెళ్లిన వారిపై చర్యలు ఉంటాయి. అటువంటి వారిపై బంధువులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఫిర్యాదు చేసినట్లయితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. నిందితులపై కేసు నమోదు చేస్తారు. వీరికి జరినామా, శిక్ష పడతాయి.

మరిన్ని వార్తలు