ఎంతపని చేశావు తల్లీ!

16 Mar, 2016 02:00 IST|Sakshi
ఎంతపని చేశావు తల్లీ!

ఇద్దరు బిడ్డలు సహా తల్లి ఆత్మహత్య       
తిరుపతిలో విషాదం
 

నవమాసాలు మోశావు.. ఇద్దరి బిడ్డలకు ప్రాణం పోశావు.
కుటుంబ కలహాలతో ఆ బిడ్డల్నే ఉరితాడుకు వేలాడదీశావు..
పిల్లలతో పాటూ నీవూ దూరమై అయినవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చావు..
ఎంతపనిచేశావు తల్లీ..!

 
 ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో..!
జీవితంపై విరక్తి చెందింది. ఈ లోకం నుంచి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. తానొక్కటే చనిపోతే పేగుతెంచుకుని పుట్టిన బిడ్డల బతుకు ఏమవుతుందోనని  ఆలోచనలో పడింది. తనతోపాటు పిల్లలిద్దర్నీ తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. మనసు చంపుకుని ముక్కుపచ్చలారని మగబిడ్డల్ని ఉరితాడుకు వేలాడదీసింది. తనూ తనువు చాలించి కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటన మంగళవారం తిరుపతిలో విషాదాన్ని నింపింది.  
 
తిరుపతి క్రైం : నగరంలోని పల్లెవీధికి చెందిన శశికుమార్, పద్మజ(25)కు 2009లో వివాహమైంది. శశికుమార్ తల్లి సరస్వతి కూడా వీరితోనే ఉండేది. వీరికి జ్యోతికిరణ్ (6), లక్ష్మీప్రసాద్(5) పిల్లలు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య స్వల్ప మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. గతంలో పోలీసులను ఆశ్రయించగా ఇరువురికీ వెస్ట్ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పద్మజ మంగళవారం మరోసారి మనస్తాపానికి గురైంది. మధ్యాహ్నం స్కూల్ నుంచి పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చి, ఆపై వారితోనే ఇంట్లో ఉండిపోయింది. సాయంత్రం 6 గంటలవుతున్నా ఇంట్లో లైటు వేయలేదు. గమనించిన అత్త లైటు వేసేందుకు ఇంటికి వచ్చి, తలుపుతట్టింది. తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూసింది. పద్మజ, ఇద్దరు పిల్లలతో ఉరేసుకుని ఉండడంతో కుమారుడు శశికుమార్‌కు తెలిపింది. అతను వెస్ట్ పోలీసులకు సమాచారం అందించాడు. డీఎస్పీ కనకరాజు, వెస్ట్ సీఐ అంజూయాదవ్, యూనివర్సిటీ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ జయశ్యామ్ చేరుకున్నారు. తలుపులు తీసి మృతదేహాలను కిందికి దించి పోస్ట్‌మార్టం నిమిత్తం రుయాకు తరలించారు. అత్త సరస్వతి, భర్త శశికుమార్ మాట్లాడుతూ పద్మజను తాము ఎప్పుడూ ఏమీ అనలేదని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
అయ్యో..

ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడం..అందులో ఇద్దరు పిల్లలు.. తల్లి ఉండడంతో వారిని చూసేం దుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. చిన్నారుల మృతదేహాలను తరలిస్తుండగా పల్లెవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విగతజీవులుగా ఉన్న చిన్నారులను చూసి స్థానికు లు కంటతడి పెట్టుకున్నారు.
 

మరిన్ని వార్తలు