‘ఆంఫినాల్ - మెడ్ టెక్ జోన్’ ఎంవోయూ మంచి పరిణామం

18 Jul, 2020 20:23 IST|Sakshi

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఆంఫినాల్  సంస్థ - ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్ (ఏఎంటీజెడ్‌) మధ్య జరిగిన ఒప్పందం కీలక మలుపు అవుతుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అధునాతన వైద్య పరికరాల తయారీ కోసం సుమారు రూ.20 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆంఫినాల్ ఒప్పందం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ ఎంవోయూతో వందలాది మంది శాస్త్రవేత్తలు, మెడికల్, ఫార్మా, ఇంజినీరింగ్ నిపుణులకు ఉద్యోగవకాశాలు తథ్యమని మంత్రి  పేర్కొన్నారు. (చౌక‌గా ఇంట‌ర్నెట్ అందించ‌డ‌మే ల‌క్ష్యం)

వైద్య పరికరాల తయారీలో 70 ఏళ్ల అపార అనుభవమున్న ఆంఫినాల్.. మనిషి శరీరంలో భౌతికమై మార్పులకు సంబంధించిన ఉష్ణోగ్రత, ప్రాణ వాయువైన ఆక్సిజన్, హ్యుమిడిటీ, ఒత్తిడి వంటి వాటి స్థాయిలను కొలిచి, నిర్ధారించే పరికరాల రూపకల్పనలో ప్రత్యేక పేరుందన్నారు. తాజా ఒప్పందంతో ఆంఫినాల్ ఇపుడు అధునాతన సెన్సర్ల తయారీకి చిరునామాగా మారనుందన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మేకపాటి మాట్లాడుతూ.. ప్రపంచమంతా కోవిడ్-19 విపత్తులా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి వైద్యపరికరాల తయారీ ఒప్పందాలు ఎంతో అవసరమని మంత్రి స్పష్టం చేశారు. 4 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శుభ్రత, మంచి అలవాట్లపై ప్రజలకు శ్రద్ధ పెరిగిందన్నారు(కడప ఉక్కుపై దిగ్గజ కంపెనీల ఆసక్తి)

కరోనా కారణంగా వైద్యరంగం, ఫార్మా, పరిశోధనలపై ప్రాముఖ్యత, సముచిత గౌరవం తెచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచానికి కీలకమైన వైద్యరంగాన్ని మరో స్థాయికి చేర్చే ఈ ఒక్క ఒప్పందం కోట్లాది మంది భవిష్యత్తుకు పరోక్షంగా, ప్రత్యక్షంగా భరోసా కలిగించడం ఖాయమన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఎంవోయూలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రొఫెసర్ విజయ్ రాఘవన్, ఫార్మాసిటికల్, మెడికల్ డివైజస్ సెక్రటరీ, పీడీ వాఘేలా, ఎలక్ట్రానిక్స్ శాఖ సెక్రటరీ అజయ్ సాహ్నీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ పాల్గొన్నారు.

స్కిల్ యూనివర్శిటీలు, కాలేజీల ఏర్పాటులో మరింత వేగం పెంచాలి..
నైపుణ్య విశ్వవిద్యాలయాలు, కాలేజీల ఏర్పాటు దిశగా మరింత వేగం పెంచాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నైపుణ్యశాఖధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 30 స్కిల్ కాలేజీలకు అవసరమైన భూమిని గుర్తించినట్లు, 12 చోట్ల భూమికి సంబంధించిన సర్వే వివరాలు పూర్తయినట్లు నైపుణ్యవృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రామ్.. మంత్రి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అయితే  మిగతా భూమి సర్వేలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి మేకపాటి సూచించారు. స్కిల్ కాలేజీల డిజైనింగ్, లేఅవుట్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపైనా మంత్రి అడిగి తెలుసుకున్నారు. కపూర్, నిరూప్ సహచరుల బృందాలు తీర్చిదిద్దిన డిజైన్లను మంత్రి పరిశీలించారు. ఒంగోలు, తిరుపతి ప్రాంతాలలో భూమి స్వాధీనం పూర్తయినట్లు వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలోని కోబాక ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్న నైపుణ్య విశ్వవిద్యాలయం కోసం 50 ఎకరాల స్థలాన్ని గుర్తించడం ఇప్పటికే పూర్తయినందున...ఇక తర్వాత పనులను వారంలోగా పూర్తిగా చేయాలని మంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాలనుసారం గుర్తించిన 48 టెక్నికల్ , 31 నాన్ టెక్నికల్ , 20 సెక్టోరల్ కోర్సులు, ల్యాబుల వివరాలపై మంత్రి చర్చించారు. 4 ఐఐటీ కోర్సులపై మంత్రి ఆరా తీశారు. 5 మంది సభ్యులతో కూడిన హైలెవల్ టెక్నికల్ కమిటీ (ఏపీఎస్ఎస్డీసీ, పరిశ్రమల శాఖ ప్రతినిధులు) ప్రతిపాదనలు, అభిప్రాయల మేరకు కోర్సులు, పరికరాలపై నిర్ణయం ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అవసరమయితే మరో కమిటీని నియమించి రెండో అభిప్రాయం తీసుకుని ముఖ్యమంత్రి నిర్ణయిస్తారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, కూర్పులో  సింగపూర్ పాలిటెక్నిక్, జీఐజెడ్‌(జర్మనీ) అభిప్రాయాలు సేకరించనున్నట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన ప్రతిపాదనలు, నైపుణ్యం వంటి అంశాలపై అధ్యయనం కోసం ఈ నెల 22న(బుధవారం) జిల్లా కలెక్టర్లు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముంది.

పరిశ్రమలకు కావలసిన శిక్షణ, నైపుణ్యం, కోర్సులవంటి విషయాలలో ఐఎస్‌బీ సహకారంపైనా మంత్రి చర్చించారు. నైపుణ్య కార్యక్రమాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో కీలకమైన జీవో.ఎంఎస్.50 అమలులో నైపుణ్య శాఖకు సంబంధించిన అన్ని విభాగాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి కూలంకషంగా చర్చించి, విశ్లేషించుకున్న అనంతరం ముందుకు వెళ్లాలని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నైపుణ్యవృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరామ్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.


 

 
 

మరిన్ని వార్తలు