ఉద్యమంలా ‘నీరు-చెట్టు’

20 Feb, 2015 01:11 IST|Sakshi

తగరపువలస: ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా చేపడుతున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి మండలం శింగనబంద పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ర్ట వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా, జిల్లాలో రూ.394 కోట్లతో అధికారులు అంచనాలు తయారు చేశారని చెప్పారు. ఇవే కాకుండా అదనంగా జిల్లాకో రూ.10 కోట్లు చొప్పున కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో అదనంగా కోటి ఎకరాల ఆయుకట్టుకు నీరందించడమే నీరు-చెట్టు కార్యక్రమం లక్ష్యమన్నారు.

జిల్లాలో తాండవ, వరాహ, శారద నదుల గట్ల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.103 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. జీవీఎంసీ, మున్సిపాల్టీలతో సంబంధం లేకుండా జిల్లాలో ఏడాదిలోగా 4.86 కోట్ల మొక్కలు పెంపకానికి నారు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 70 కోట్ల మొక్కలు పెంచుతామన్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందన్నారు. పరుగెడుతున్న నీటిని నిలబెట్టి, నిలబడిన నీటిని భూమిలో ఇంకేలా చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. దీని కోసం చెరువుల్లో మట్టిని తీసేందుకు యంత్రాలను కూడా వినియోగించుకోవడానికి అనుమతులు ఇచ్చామన్నారు. తవ్విన మట్టితో గ్రామాలు, శ్మశాన వాటికకు రహదారులతో పాటు పాఠశాలల్లో పల్లపు ప్రాంతాలను పూడ్చడానికి వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవా, కలెక్టర్ యువరాజ్ డ్వామా పీడీ శ్రీరాములునాయుడు, అదనపు పీడీ ఆనందరావు పాల్గొన్నారు.

కాగా జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ఎమ్మెల్యేలు దీనిని ప్రారంభించారు. పాడేరు మండలం వంతాడపల్లిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మొక్కలు నాటారు. అరకులోయ మండలం చొంపిలో నీటి కందకాల తవ్వకం పనులను ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రారంభించారు. మాడుగుల మండలం కామకూటం కొండవద్ద ట్రెంచ్‌ల తవ్వకాన్ని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు చేపట్టారు.

మరిన్ని వార్తలు