అదే జోరు

19 Sep, 2013 02:44 IST|Sakshi

సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ప్రారంభమైన ఉద్యమం 50వ రోజూ అదే జోరు.. హోరుతో కొనసాగుతోంది. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన వెలువడటంతో మొదలైన నిరసనలు రోజురోజుకూ ఉధృతమయ్యాయి. ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలూ మద్దతు పలుకుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఎన్జీవోల సమ్మెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.
 
 సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో కొనసాగుతున్న ఉద్యమం బుధవారం కూడా ఉధృతంగా సాగింది. గురువారం అర్ధరాత్రి నుంచి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జేఏసీ సమ్మెలోకి వెళ్లనుంది. జిల్లాస్థాయి అధికారులంతా మద్దతు ప్రకటిస్తున్నారని జిల్లా అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు, డీఆర్వో ఎల్.విజయచందర్ ప్రకటించారు. జిల్లా అధికారులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెలోకి వెళుతున్నట్లు పేర్కొంటూ గురువారం ఉదయం కలెక్టర్‌కు నోటీసు అందజేస్తామన్నారు.

ఉద్యమంలో భాగంగా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్యులు, సిబ్బంది 50 బెలూన్లను గాలిలోకి వదిలి నిరసన తెలిపారు. జిల్లా కోర్టు ప్రధానగేటు ఎదుట న్యాయశాఖ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని న్యాయశాఖ జేఏసీ నాయకులతో కలిసి భోజనం చేసి, వడ్డించి తన మద్దతు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మచిలీపట్నం కోనేరుసెంటరులో జిల్లా అధికారులు ఒకరోజు దీక్ష చేపట్టారు. దివి ఏరియా జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో తుర్లపాటి రామ్మోహనరావు, అలపర్తి గోపాలకృష్ణ చేపట్టిన ఆమరణదీక్షలు రెండోరోజుకు చేరాయి.

మైలవరంలో ‘సమైక్యాంధ్ర ఉద్యమం- ఆవశ్యకత’ అనే అంశంపై జాతీయరహదారిపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. జి.కొండూరులో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 24వ రోజుకు చేరాయి. ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు. రెడ్డిగూడెం సెంటర్‌లో శ్రీనారాయణ టెక్నో స్కూల్ విద్యార్థులు ర్యాలీ జరిపారు. నూజివీడులో వైఎస్సార్‌సీపీ నాయకుల రిలేదీక్షలు 23వ రోజుకు చేరాయి. ఉంగుటూరులో సమైక్యవాదులు పాఠశాలను మూయించారు. కంచికచర్లలో గౌతమ్ విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుంచి జాతీయ రహదారి మీదుగా పెట్రోల్ బంక్‌ల సెంటర్ వరకు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై కూర్చుని మౌనంగానే రహదారిని దిగ్బంధించారు.

 300 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన..

 భవన నిర్మాణశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉద్యోగులందరూ 300 మీటర్ల జాతీయ జెండాతో గుడివాడ పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నేత, సర్పంచ్ గోపీగీతాకుమారి, పాలకవర్గ సభ్యులు, పార్టీ నేతలు కలిసి రిలేదీక్షల్లో కూర్చున్నారు. కౌతవరంలో తెలంగాణకు వ్యతిరేకంగా స్వశక్తి సంఘాల మహిళలు వేలాది మంది రాస్తారోకో, ధర్నా, మానవహారం కార్యక్రమాలు చేపట్టారు. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో విద్యుత్‌శాఖ సిబ్బంది రిలేదీక్షల్లో పాల్గొన్నారు. ప్రతాప్ జూనియర్ కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్ స్తంభింపజేశారు.

నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో 42వ రోజు దీక్షలలో ఐకేపీ ఉద్యోగులు పాల్గొన్నారు. న్యాయవాదులు చేస్తున్న రిలేదీక్షలు 31వ రోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ మానవహారం నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ సెంటర్‌లో వాసవీక్లబ్ ఆధ్వర్యంలో మాన్యసూక్త హోమం శాస్త్రోక్తంగా జరిపారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో జరుగుతున్న 36వ రోజు రిలే దీక్షలో ముస్తాబాద జెడ్పీ, ఎంపీపీ పాఠశాలలు, గొల్లనపల్లి జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయులు 20 మంది పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, జేఏసీ నాయకులతో కలిసి విద్యార్థులు సైకిళ్లపై జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు.

పెడనలో మండలంలోని 24 పంచాయతీల గ్రామ సమాఖ్య సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు రిలేదీక్షలో కూర్చున్నారు. బంటుమిల్లి చౌరస్తాలో హేమలత కలంకారీ ఫ్యాబ్రిక్స్ నిర్వాహకులు, కలంకారీ కార్మికులు ప్రింటింగ్  పనులు చేశారు. కోరా వస్త్రాలను బళ్లపై పెట్టి ప్రింటింగ్ పనులు చేపట్టి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో రిలేదీక్షలు 33వ రోజుకు చేరుకున్నాయి. పెదపారుపూడిలో రేషన్ డీలర్లు, ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు.

అనంతరం గుడివాడ-కంకిపాడు రహదారిపై మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. కలిదిండి మండలంలోని గుర్వాయిపాలెం సెంటరులో సరోజిని డ్వాక్రా గ్రూప్ సభ్యులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయవాడలో కార్పొరేషన్ ఉద్యోగ జేఏసీ సభ్యులు మోటార్‌బైక్‌లపై కనకదుర్గ ఆలయగిరి ప్రదర్శన నిర్వహించారు. 13 జిల్లాల సీమాంధ్ర మాదిగ నాయకుల ఆధ్వర్యంలో మంద కృష్ణమాదిగ దిష్టిబొమ్మను నగరంలో ఊరేగించి, దహనం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు