బుగ్గవాగు విస్తరణకు ప్రతిపాదనలు

16 Nov, 2019 04:41 IST|Sakshi

రిజర్వాయర్‌ సామర్థ్యం రెట్టింపు

రూ.1.40 కోట్లతో డీపీఆర్‌కు సన్నాహాలు

తీరనున్న గుంటూరు, ప్రకాశం జిల్లాల దాహార్తి

సాగర్‌ కుడికాలువ పరిధిలో ఆయకట్టు స్థిరీకరణ

ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో పనుల్లో కదలిక

సాక్షి, అమరావతి బ్యూరో : పల్నాడు ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే బుగ్గవాగు విస్తరణ పనులకు అడుగు ముందుకు పడుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలో బుగ్గవాగు ప్రాజెక్టు విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీకి రూ.1.40 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నిధులు మంజూరు కాగానే ప్రైవేట్‌ ఏజెన్సీకి పనులు అప్పగించి ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.7 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు పెంచడంపై అంచనాలు రూపొందిస్తామని పేర్కొంటున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం పెంపు వల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్య పూర్తిగా తీరడంతోపాటు నాగార్జున సాగర్‌ కుడి కాలువ పరిధిలో ఆయకట్టుకు స్థిరీకరణ జరగనుంది.

ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి చొరవతో.. 
మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుగ్గవాగు విస్తరణ పనుల ఆవశ్యకతను ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌కు నివేదించారు. స్పందించిన ముఖ్యమంత్రి డీపీఆర్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

 డీపీఆర్‌కు సన్నాహాలు..
 ‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుగ్గవాగు ప్రాజెక్టు విస్తరించి 3.7 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు పెంచేందుకు డీపీఆర్‌ కోసం సన్నాహాలు చేస్తున్నాం. ప్రాజెక్టు విస్తరణ వల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటి సమస్య తీరి సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది’ 
– పురుషోత్తం గంగరాజు, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ 

మరిన్ని వార్తలు