వృత్తి గ్లాస్‌ ఫిట్టర్‌.. ప్రవృత్తి సినిమా ఫైటర్‌!

14 Aug, 2019 11:46 IST|Sakshi
దుకాణంలో గ్లాస్‌ ఫిట్టింగ్‌ పనులు చేస్తున్న రాజేష్‌

నటనలో ప్రతిభ చాటుతున్న కల్లూరు వాసి 

వెండితెరపై అవకాశాలు 

విలన్‌ పాత్రలో రాణింపు

సాక్షి, కల్లూరు: నటనపై ఆసక్తి ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనేందుకు ఈ యువకుడే నిదర్శనం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిత్రపరిశ్రమలో ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. కల్లూరుకు చెందిన ఈస్యం రాజేష్‌ గౌడ్‌ 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువులో రాణించలేక పోవడంతో కర్నూలు ఆటోనగర్‌లోని గాస్ల్‌ ఫిట్టింగ్‌ షాపులో ఫిట్టర్‌గా పని చేసేందుకు 1995లో చేరాడు. వృత్తిలో మెలకువలు నేర్చుకునేందుకు తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లి శిక్షణ పొందాడు. అనంతరం 2004లో వాణిజ్య నగర్‌లో గ్లాస్‌ ఫిట్టింగ్‌ షాపును ప్రారంభించాడు.

15 ఏళ్లుగా వివిధ వాహనాలకు, ఇళ్లకు, దుకాణాలకు గ్లాస్‌ ఫిట్టింగ్‌ పనులు చేస్తున్నాడు. ఇతనికి భార్య సమతతోపాటు శశినిల్‌గౌడ్, హర్షవర్దన్‌ గౌడ్‌ ఇద్దరు కుమారులు ఉన్నారు. 2005లో తొలిసారిగా స్నేహితుల సహకారంతో షార్ట్‌ ఫిల్మ్‌ ‘చీరల మోజు’లో నటించాడు. నటనలో మొదట షార్ట్‌ఫిల్మ్‌ వద్ద పడిన అడుగు నిదా నంగా వెండితెరకు పరిచయం చేసింది. ప్రస్తు తం ప్రధాన విలన్‌ పాత్రకు కూడా అవకాశాలు వస్తున్నాయి. 
షార్ట్‌ఫిల్మ్‌ టు వెండితెర 
నటనపై ఆసక్తి ఉన్న రాజేష్‌ అంచలంచెలుగా ఎదుగుతూ షార్ట్‌ ఫిల్మ్‌ నుంచి వెండితెర వరకు దూసుకువెళ్తున్నాడు. ఇతను మొదటగా 17 నిమిషాలు నిడివిగల ‘చీరల మోజు’ షార్ట్‌ ఫిల్మ్‌తో  నటన ప్రారంభమైంది. ఆ తర్వాత నయన, యువర్‌ మై ఎమ్మెల్యే, కామన్‌ మ్యాన్‌ తదితర షార్ట్‌ ఫిల్మ్‌ల్లో రాజేష్‌ నటించాడు. నయనలో రౌడీగా, కామన్‌ మ్యాన్‌లో సీబీఐ ఆఫీసర్‌ పాత్రలో కనిపించాడు. దీంతో కర్నూలు నగరానికి చెందిన ఫిల్మ్‌ కో–ఆర్టినేటర్‌ నరసింహులు ద్వారా ‘కమల్‌’ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో బిహార్‌ గ్యాంగ్‌ లీడర పాత్రను పోషించాడు. ఆ తరువాత ఇటీవల విడుదలైన ‘నేను లేను’ సినిమాలో విహారయాత్రకు వచ్చిన హీరో, హీరోయిన్‌లను బెదిరించి దోచుకోవడం, వారిని దెబ్బకొట్టేæ విలన్‌ పాత్రలో నటించాడు.

ప్రస్తుతం హీరో ప్రభాస్‌ తమ్ముడు వర్మ హీరోగా తీస్తున్న బుల్లెట్‌ సినిమాలో, కోడుమూరుకు చెందిన దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో విలన్‌ పాత్రలు పోషిస్తున్నాడు. తెనాలి రామకృష్ణ సినిమాలో బిహారీ గ్యాంగ్‌ లీడర్‌గా రాజేష్‌ ఉంటాడు. అలాగే పలు ప్రముఖ దర్శకులు నిర్మిస్తున్న చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్లు చెబుతున్నా డు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన నటతో వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నట్లు రాజేష్‌ చెబుతున్నాడు.    

మరిన్ని వార్తలు