ఆధార్ అంతంతే..

23 Mar, 2015 03:04 IST|Sakshi

ప్రభుత్వం మాట మాట్లాడితే చాలు ప్రతి పనికి ఆధార్ అనుసంధానం అంటుంది. రేషన్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్, పింఛన్లు, ఇలా వివిధ అంశాలకు ఆధార్ అనుసంధానం వేగవంతంగా పూర్తిచేసినా వాహనాల విషయానికొచ్చేసరికి అధికారులకు తిప్పలు తప్పడం లేదు. ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు వాహనదారులు ముందుకు రావడం లేదు. వాహనం ఉందంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
 
సాక్షి, కడప: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఆధార్ అనుసంధానానికి ఆశించిన స్పందన లభించడం లేదు. గత నవంబరు 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టినా ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. కృష్ణా జిల్లాలోని గుడివాడ, కర్నూలు జిల్లాలోని నంద్యాలను ముందుగా పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని ఉద్యమంలా అనుసంధాన కార్యక్రమం చేపట్టినా.. ఆ రెండు ప్రాంతాలతోపాటు మిగతా జిల్లాల్లోనూ అనుసంధాన కార్యక్రమం మందకొడిగా సాగుతోంది.

ఆధార్ అనుసంధానానికి సంబంధించి మిగతా అన్ని కార్యక్రమాలకు ప్రజలు సహకరించినా వాహన రిజిస్ట్రేషన్ అనుసంధానానికి మాత్రం వాహనదారుల సహకారం కరువవుతోంది. ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాందోళనలు,.అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు దీనిపై ప్రచారం కల్పించి ఉంటే వాహనదారుల నుంచి మంచి స్పందన లభించేదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.  ప్రత్యేకంగా పెట్రోలు బంకుల వద్ద అనుసంధానానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా వాహనదారులు తమకు అవసరం లేదంటూ కరాఖండిగా చెప్పి వెళ్లిపోతున్నారు.  
 
సగం కూడా పూర్తికాని అనుసంధానం..
రాష్ట్రంలో రవాణాశాఖకు సంబంధించి అధికారులు అనుసంధానం చేయాలని కృత నిశ్చయంతో పరుగులు పెడుతున్నా అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టంగా మారింది. కొంత సిబ్బంది కొరత కూడా జిల్లా రవాణాశాఖాధికారులను వేధిస్తోంది. నవంబరులో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ   సగానికి సగం కూడా ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం అధికారులను కలవరపెడుతోంది.
 
రాష్ర్టంలో ఇప్పటివరకు 30 శాతమే
రాష్ట్రంలో వాహన లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి రవాణాశాఖ ప్రత్యేకంగా చేపట్టిన ఆధార్ అనుసంధానం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు అనంతపురం జిల్లా 41.33 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, విశాఖపట్టణం 14.38 శాతంతో ఆఖరు స్థానంలో ఉంది.  వైఎస్సార్ జిల్లాలో మొత్తం లెసైన్సులు 6 లక్షల 69 వేల 833 ఉండగా 1 లక్ష 88వేల 635 ఆధార్‌తో అనుసంధానమయ్యాయి.
 
వాహనదారుల్లో అనుమానాలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేకంగా వాహనదారుల్లో అనుమానాలు నివృత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించి ప్రచారం చేసినా ప్రజల్లో మాత్రం భయాందోళనలు తొలగడం లేదు. అధికారులు చెబుతున్నా....రేపు ఇబ్బంది జరిగితే ఎవరికి చెప్పుకోవాలని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా అనుసంధానం చేయడంతో తద్వారా పేరు, ఊరు, వాహన వివరాలు నమోదు కావడంతో ప్రభుత్వం ఏదో ఒక సాకు చూపి అసలుకే ఎసరు పెడుతుందని పలువురు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ప్రధానంగా రేషన్‌కార్డులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సబ్సిడీల్లో కోత, ఇళ్ల మంజూరు, రుణాలు, ఇతర పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ వాహనాల ఆధార్ అనుసంధానానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.

మరిన్ని వార్తలు