థియేటర్ల బ్లాక్‌బస్టర్‌

28 Aug, 2019 08:12 IST|Sakshi

థియేటర్ల యజమానుల దోపిడీ

బెనిఫిట్‌షోల పేరుతో వ్యాపారం

టికెట్‌ రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకూ 

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : తమకు ఇష్టమైన నటుడి సినిమాను  విడుదల రోజు మొదటి ఆట (బెనిఫిట్‌ షో) చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహం చూపుతుంటారు. అభిమానుల ఆత్రుతను ఆసరా చేసుకుంటున్న థియేటర్ల నిర్వాహకులు అభిమానులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు విడుదలైన ప్రతిసారీ టికెట్‌ వాస్తవ ధర కన్నా.. కొన్ని రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ అభిమానుల జేబులు కొల్లగొడుతున్నారు. ఈ నెల 30న ఓ ప్రముఖ తెలుగు హీరో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద చరిత్రను తిరగరాశాయి. బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా విడుదల తేదీకి ఒకరోజు ముందు అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్‌ షో వేసుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. దీన్ని అడ్డం పెట్టుకుని థియేటర్ల యజమానులు టికెట్‌ ధరలను భారీగా పెంచేశారు. సాధారణ రోజుల్లో సినిమా టికెట్ల ధరలు తరగతులను బట్టి రూ.40, రూ.70, రూ.120, రూ. 150గా ఉంటాయి. పెద్ద హీరోలు, ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు వచ్చినప్పుడు  చిత్ర నిర్మాణ సంస్థలు  సినిమా విడుదలైన మొదటి వారం, పదిరోజుల పాటు సాధారణ రోజుల్లో ధరల కంటే అదనంగా విక్రయించుకునేందుకు అనుమతులను తీసుకుంటాయి. ఈనెల 30న విడుదల కాబోయే సినిమాకు కూడా అనుమతులు తీసుకున్నారు. అనుమతులకు అనుగుణంగా తరగతుల వారీగా రూ.50, రూ.100, రూ.200 కు టికెట్లను విక్రయించాల్సి ఉంటుంది.

కానీ ఈ రేట్లకు ఏమాత్రం సంబంధం లేకుండా టికెట్ల ధరలను థియేటర్ల యాజమాన్యాలు భారీగా పెంచేశాయి. అనుమతులు తీసుకున్న దానికన్నా.. ఎక్కువ ధరలకు విక్రయించేందుకు సినిమా డిస్ట్రిబ్యూటర్లు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఏలూరులో రూ.50కి విక్రయించాల్సిన టికెట్‌ను రూ.300కు, రూ.100కి విక్రయించాల్సిన టిక్కెట్‌ను రూ.400కు, రూ.200కు విక్రయించాల్సిన టిక్కెట్‌ను రూ.1000కు అమ్ముతున్నట్టు సమాచారం. భీమవరంలో రూ.200కు అమ్మాల్సిన టిక్కెట్‌ను రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకూ అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అభిమాన సంఘాల నాయకుల ఆందోళన 
సాధారణంగా బెనిఫిట్‌ షో టికెట్లను అభిమాన సంఘాల నాయకులు తీసుకుంటుంటారు. ఈ సినిమా టిక్కెట్లనూ తీసుకునేందుకు అభిమాన సంఘ నేతలు డిస్ట్రిబ్యూటర్‌ను సంప్రదించగా తాము నిర్ణయించిన ధరలను చెల్లించి టికెట్లను తీసుకోవాలని చెప్పినట్టు అభిమాన సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. దీంతో చేసేది  లేక ఆ ధరలకే టికెట్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆన్‌లైన్‌ విక్రయాలు స్టాప్‌ 
ప్రతి సినిమా విడుదల  తేదీ ముందు నుంచే ఆయా షోల టికెట్లను థియేటర్ల నిర్వాహకులు  ఆన్‌లైన్‌లో విక్రయాలకు ఉంచుతుంటారు. కానీ పెద్ద హీరోల సినిమా టికెట్లను మొదటి రెండు, మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో పెట్టకుండా అదనపు ధరలకు విక్రయిస్తూ ప్రేక్షకుల జేబులను కొల్లగొడుతున్నారు. టికెట్ల ధరలను మొదటి వారం రోజులపాటు పెంచి విక్రయించుకొనేందుకు అనుమతులు  ఇచ్చినప్పటికీ  విక్రయించే ధరలను థియేటర్‌ బుకింగ్‌ కౌంటర్‌ వద్ద  ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ థియేటర్ల నిర్వాహకులు ఆ విధంగా చేయడం లేదు. ఇలా చేయకపోవడం కూడా చట్ట విరుద్ధమేనని అధికారులు చెబుతున్నారు.  

పోలీసుల పాత్రపై అనుమానాలు
సినిమా టికెట్ల ధరలను నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ బెనిపిట్‌ షోల టికెట్లను అదనపు ధరలకు విక్రయించుకునేందుకు పోలీసు శాఖ అధికారులూ  సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పోలీసు అధికారులు ఇలాగే అనుమతులు ఇవ్వడం, దీనిపై సాక్షిలో కథనాలు రావడంతో విచారణ జరిపి గతంలో  ఒక ఇన్‌స్పెక్టర్, ఒక హెడ్‌కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. 

కనీస సదుపాయాల్లేవు 
పెద్ద సినిమాలు విడుదల అవుతున్న  సమయంలో  సాధారణ ధరల కంటే ఎక్కువకు విక్రయించుకునేందుకు అనుమతులను తీసుకువస్తున్నారు. దీంతో పాటు బెనిఫిట్‌ షో టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తూ అభిమానుల జేబులు కొల్లగొడుతున్నారు. దీనిలో చూపిస్తున్న శ్రద్ధ థియేటర్లలో ప్రేక్షకులకు వసతులు కల్పించడంలో చూపడం లేదు. దీనిపై  జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.          
 – జి.శివకుమార్‌. డీవైఎఫ్‌ఐ  జిల్లా నాయకుడు

నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోం 
కొత్త సినిమాల విడుదల సమయంలో నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు టికెట్లు అమ్మితే ఊరుకోం. బుధవారం సినిమా థియేటర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతాను. నిబంధనలు ఏం చెబుతున్నాయో, దానికి అనుగుణంగా టికెట్లు అమ్మాల్సి ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ధరలకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటాం.
దిలీప్‌కిరణ్, ఏలూరు డీఎస్పీ    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా