మాట ఇచ్చారు.. నెరవేర్చారు  

27 Jul, 2019 11:22 IST|Sakshi
ఎన్నికల సమయంలో విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాళెంలో తాగునీటి సమస్యను ప్రసన్నకుమార్‌రెడ్డికి విన్నవిస్తున్న ప్రజలు (ఫైల్‌) 

మత్స్యకారుల్లో ఆనందహేళ

పలుచోట్ల వాటర్‌ప్లాంట్ల ఏర్పాటు

రూ.56 లక్షల మంజూరు చేసినందుకు ఎంపీ ఆదాలకు ఎమ్మెల్యే ప్రసన్న కృతజ్ఞతలు  

టీడీపీ ఐదేళ్ల పాలనలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు.  వ్యర్థాల నీటిని తాగి వ్యాధులబారిన పడ్డారు. దివంగత మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి హయాం నుంచి నల్లపరెడ్ల వైపే కోవూరు నియోజకవర్గ ప్రజలు నమ్మకముంచారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి తమ గోడును చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని సమస్యలను ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూ.56 లక్షలతో వాటర్‌ప్లాంట్లు మంజూరు చేయించారు. దీంతో మత్స్యకారులతో పాటు మిగతా ప్రాంతాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదాలకు కృతజ్ఞతలు తెలిపారు. 

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: కోవూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో వాటర్‌ప్లాంట్ల ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి రూ.56లక్షలు  మంజూరు చేశారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వెళ్లిన తనకు ప్రజలు తాగునీటి సమస్యలు వివరించారన్నారు. ఈ విషయాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. నిధులు మంజూరు చేసినందుకు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పనులకు సంబంధించి త్వరితగతిన ప్రొసీడింగ్స్‌ ఇచ్చినందుకు కలెక్టర్‌ శేషగిరిబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 

నిధుల కేటాయింపు ఇలా..
విడవలూరు మండలం కొత్తూరు దగ్గరలోని పాతూరులో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించినట్లు ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు.
విడవలూరు మండలంలోని బుసగాడిపాళెం గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. 
విడవలూరు మండలంలోని రామతీర్థం పంచాయతీ రామలింగాపురంలో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చారు. 
విడవలూరు మండలంలోని దంపూరు పంచాయతీ రామచంద్రాపురం గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చే శారు. 
విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాళెంలో పైప్‌లైన్ల రీప్లేస్‌మెంట్‌కు సంబంధించి రూ.5 లక్షలు కేటాయించారు.
విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాళెంలోని నివాసగృహాల తాగునీటి కుళాయిల కనెక్షన్ల కోసం రూ.లక్ష  ఇచ్చారు.
కోవూరు పట్టణంలోని నందలగుంట గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు.
కోవూరు పట్టణంలోని పెళ్లకూరుకాలనీలో  ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5లక్షలు నిధులు ఇచ్చారు.
కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. 
కోవూరు మండలం వేగూరు పంచాయతీ సీతారామపురంలో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. 
కొడవలూరు మండలం ఆలూరుపాడు ఎగువమీద గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. 
ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెంలో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరుచేశారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు.   

మరిన్ని వార్తలు