ప్రధాని మోదీకి ఎంపీ బాలశౌరి లేఖ

22 Mar, 2020 20:51 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ :  కరోనా నేపథ్యంలో భారీగా నష్టాలను చవిచూసే టూరిజం, ట్రావెల్, పౌల్ట్రీ రంగాలను ఆదుకోవడానికి తగిన ప్రోత్సాహకాలను ప్రకటించాలని మచిలీపట్నం వైఎస్సార్‌ సీపీ ఎంపీ బాలశౌరి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ సమయంలో ప్రస్తుత 2019-20 ఆర్ధిక సంవత్సరం ముగింపును మార్చి 31కి బదులుగా  ఏప్రిల్ 30కి  పొడిగించేటట్లు ఆర్డినెన్సు తేవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎంపీ బాలశౌరి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో.. వ్యక్తిగతంగా కట్టవలసిన చెల్లింపులైన గృహ ఋణాలు, వ్యక్తిగత రుణాల విషయంలో కూడా కొంత వెసులుబాటు కల్పించాలన్నారు. ( ఏపీ.. ఇంటర్‌ చివరి పరీక్ష వాయిదా)

చిన్న మధ్య తరగతి సంస్థల నగదు చెల్లింపుల విషయంలో జీఎస్టీ రేట్లను తగ్గించడంతో పాటు పన్ను చెల్లింపు కాలవ్యవధిని కనీసం 60 రోజులకు పెంచాలని, జీఎస్టీ ఇతర పన్ను చెల్లింపుల విషయంలో గడువు తేదీలను పోడిగించాలని కోరారు. రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాలకు, వారి ఇళ్లకే నిత్యావసర సరుకులను అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. చట్ట బద్ధమైన అన్ని పన్ను చెల్లింపుల విషయంలో ప్రస్తుతమున్న అన్ని తేదీలను తప్పనిసరిగా పొడిగించాలని విన్నవించారు. ( ఈ నెలాఖరు వరకు ఏపీ లాక్‌డౌన్‌ : సీఎం జగన్‌ )

మరిన్ని వార్తలు