తెరుచుకోని ‘గల్లా’ పెట్టె

27 Dec, 2018 12:52 IST|Sakshi

వచ్చే నిధులను ఖర్చు చేసేందుకు ఎంపీ గల్లా జయదేవ్‌కు తీరిక లేదు

ఇప్పటికి మూడు విడతల్లో రూ16.73 కోట్ల విడుదల

ఇందులో 80 శాతం కూడా ఖర్చు కాకపోవడంతో 2017–18 సంవత్సరం నిధులు విడుదల కాని వైనం

దీని ప్రభావం 2018–19  సంవత్సరంపై పడే అవకాశం

సాక్షి, అమరావతి బ్యూరో: కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని కూడా ఖర్చు చేసే తీరిక లేనంత బిజీగా ఎంపీ గల్లా ఉండటంతో గుంటూరు పార్లమెంటు పరిధిలో పలు సమస్యలు తిష్ట వేశాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్లమెంటు సభ్యులకు వారి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసేందుకు కేంద్రం ఏటా రూ.5 కోట్లు కేటాయిస్తోంది. ఇందులో 80 శాతం ఖర్చు చేస్తేనే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 5 కోట్లను విడుదల చేస్తారు. అయితే, విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా అప్పుడప్పుడు నియోజక వర్గానికి వచ్చే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు , కేంద్రం ప్రభుత్వం ఏటా ఇచ్చే నిధుల్ని ఖర్చు చేసే తీరిక లేదు. దీంతో 2017–18కి ఆగిపోయాయి. దీని ప్రభావం 2018–19 ఆర్థిక సంవత్సరంపై కూడా పడుతోంది. 2019 ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాలకు సంబంధించి రూ.10 కోట్లు మురిగి పోయే అవకాశం ఉంది. ఎంపీ నిర్లక్ష్యంతో పలు అభివృద్ధి పనులు ప్రజలకు చేరువ కాకుండా పోయే ప్రమాదముంది. ఎంపీగా గల్లా జయదేవ్‌ పూర్తిగా విఫలం అయ్యారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చుట్టం చూపుగా పర్యటనలు
ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనప్పటికీ, పెద్దగా నియోజక వర్గం పై దృష్టి సారించలేదు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. పార్లమెంటు పరిధిలో సమస్యల గురించి పట్టించుకోకుండా  ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళుతూ ఉంటారు. నియోజకవర్గ పరిధిలో జరిగే అధికారిక సమావేశాలకు సైతం ఆయన హాజరుకావడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ అనధికారికంగా తల్లి గల్లా అరుణకు బాధ్యతలు అప్పజెప్పడంపై స్థా¯నిక నేతల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నిధులు ఇవ్వటం లేదని కుంటి సాకులు చెప్పే టీడీపీ నాయకులు... తమకు కేటాయించే పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని ఖర్చు చేయడంలో ఎందుకు  విఫలం అయ్యారో చెప్పాలని పలువురు నిలదీస్తున్నారు.

పనుల గురించి పట్టించుకునే నాథుడే లేడు
15వ పార్లమెంటుకు సంబంధించి మిగలు నిధులు రూ. 1.73 కోట్లను 2014–15 సంవత్సరానికి అదనంగా కేటాయించారు. ఇప్పటికి ఎంపీ గల్లా జయదేవ్‌ 622 పనులను మంజూరు చేయగా, వాటిలో ఇంకా 277 పనులు పూర్తి కాలేదు. 2104–15లో మంజూరు అయిన పనులు సైతం ఇప్పటికి సాగుతున్నాయి. ఏ దశలో ఉన్నాయో ఇప్పటికీ కనీసం అధికారులు, కాంట్రాక్టర్‌లతో సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఆ పనుల గురించి పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. ఎంపీ శ్రద్ధ చూపితే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఆయన నిర్లక్ష్యం నియోజక వర్గం పాలిట శాపంగా మారింది. ఎలక్షన్‌ కోడ్‌ ముంచుకొస్తున్న ఈ సమయంలోనైనా ఎంపీ స్పందించి అభివృద్ధి పనులవైపు దృష్టి సారించి, కోటా నిధుల్ని ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్‌ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు