ఖాకీ డ్రస్‌ తీసేసి రా..!

22 Sep, 2018 04:41 IST|Sakshi
తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న ఎంపీ జేసీ

     రేయ్‌.. సీఐ మాధవ్‌.. నన్ను బెదిరించేంత మగాడివా?

     నువ్వు చెప్పిన చోటికొస్తా.. నా నాలుక కొయ్‌

     అవసరమైతే కత్తికి పదునుపెట్టుకో ఆర్నెళ్లలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా

     ఈ టైంలో కొజ్జా జాతిలో చేరిపోయానని బాధపడుతున్నాఅసలు పోలీసు అధికారుల సంఘమే లేదు..

అనంతపురం టౌన్‌: ‘రేయ్‌.. సీఐ మాధవ్‌! కొజ్జాలు అన్నందుకు నా నాలుక కోస్తానంటావా? సినిమాల్లో సాయికుమార్‌లా మీసాలు తిప్పుతావా? నన్ను బెదిరించేంత మగాడివా? రేయ్‌.. ఖాకీ డ్రస్‌ విప్పేసిరా! నేను వస్తా. నీది నిజమైన మీసం అయితే చెప్పురా! ఆడ, మగ కానివాళ్లకు కూడా మీసాలున్నాయమ్మా. ఈ మహానుభావుడు (మాధవ్‌) జైల్లో చిప్పకూడు తిని వచ్చాడు. నా చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో గుర్తు తెచ్చుకో! నాకైతే గుర్తులేదు.

పారిపోతే.. కొజ్జానే!
ఏయ్‌ మాధవ్‌.. ఈ నెల 25 వరకూ అనంతపురంలోనే ఉంటా. ఎక్కడికి రావాలో చెప్పు. మీ ఊరికి రావాలా? అనంతపురం టవర్‌క్లాక్‌ వద్దకు రావాలా? ఏ ప్లేస్‌ చెబితే అక్కడికి వస్తా. వచ్చి నా నాలుక కోయి.. అవసరమైతే అప్పటి వరకూ కత్తికి పదును పెట్టుకో. పారిపోయే వారిని రాయలసీమతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా కొజ్జాలనే అంటారు. కాబట్టి పోలీసులు కొజ్జాలే! వారితో పాటూ నేనూ కొజ్జానే! దివాకర్‌రెడ్డి అంటే ఇప్పటి వరకూ సింహమనో, నెత్తిన కొమ్ములు వచ్చాయనో అంతా అనుకునేవారు. ఆర్నెల్లలో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా. ఈ సమయంలో కొజ్జా జాతిలో చేరిపోయానని బాధపడుతున్నా...!’ శుక్రవారం అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో సమావేశం సందర్భంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలివీ.

కోర్టునూ ఆశ్రయిస్తా...
కొజ్జా అనేది అన్‌పార్లమెంటరీ పదమైతే పాదాలపై పడి క్షమాపణ చెబుతానని జేసీ పేర్కొన్నారు. అయినా పోలీసు అధికారుల సంఘమనేది లేదన్నారు. వారు ఆ పేరు పెట్టుకోవడంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. ‘ప్రబోధానంద స్వామి ఆశ్రమానికి చెందిన భక్తులు ప్రజలపై విచక్షణా రహితంగా దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు పారిపోయారు. వారితో పాటు నేనూ పారిపోయా. గొడవ జరిగితే ఎదుటి వారు రాయివేస్తే మనం అడ్డుగానైనా నిలబడాలి. అలా కాకుండా పారిపోయే వారిని ఎక్కడైనా కొజ్జాలనే అంటారు’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరికీ సంఘాలున్నాయి, మాకు మాత్రం (ఎంపీ, ఎమ్మెల్యే) సంఘాలు లేవు అని జేసీ వ్యాఖ్యానించారు.

ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు
ప్రబోధానంద ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని జేసీ ఆరోపించారు. ‘మహిళలు పడక పంచుకోవాలనే రీతిలో వాడు (ప్రబోధానంద) వ్యవహరిస్తున్నాడు. రావణబ్రహ్మ అంట! హిందూ దేవుళ్లను అసభ్యంగా దూషిస్తున్నారు. అక్కడున్న వారికి నకిలీ ఆధార్‌కార్డులు, ఓటర్, రేషన్‌కార్డులు సృష్టించారు. అక్కడున్న  అత్యాధునిక ప్రింటింగ్‌ మిషన్లో ఇవన్నీ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశా. వీడు డేరాబాబా కంటే దారుణమైన బాబా’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

సీఐ మాధవ్‌పై తాడిపత్రి స్టేషన్‌లో జేసీ ఫిర్యాదు
తాడిపత్రి: సీఐ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ పోలీస్‌ అధికారిలా కాకుండా వీధి రౌడీలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపులకు దిగిన సీఐపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.

>
మరిన్ని వార్తలు