ఏపీ నిలబడే వరకు సహాయం అందించాలి

9 Mar, 2020 12:32 IST|Sakshi

విభజన చట్టం అమలుపై మోదీ, జగన్‌లకు ఎంపీ కేవీపీ లేఖలు

సాక్షి, ఢిల్లీ: విభజన చట్టం అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌కి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖలు రాశారు. పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. ఏపీకి న్యాయం చేస్తానని చెప్పి మోదీ అధికారంలోకి వచ్చారని.. తిరుమల వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాలను ఆయన మరిచిపోయారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. తప్ప కొత్తగా ఏమీ కోరడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాపై కుంటిసాకులతో ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం గ్రహించి ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని లేఖలో కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో పనిచేయాలని.. పారిశ్రామిక పన్ను రాయితీలు రాష్ట్రానికి ఇవ్వాలని కేవీపీ కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా పరిశ్రమల రాకకు సహకరించాలన్నారు. గత ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న 60 శాతం నిధులకు మరో 30 శాతం లెక్కకట్టి ఇవ్వాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ నిలబడే వరకు సహాయం అందించాలని లేఖలో కేవీపీ కోరారు.

రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌కు కేవీపీ రామచంద్రరావు మరో లేఖ రాశారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న వాటిని చట్టబద్ధంగా అమలు చేయించుకోవాలని సూచించారు.
(చదవండి: టీడీపీకి భారీ షాక్‌; మాజీ మంత్రి రాజీనామా)

మరిన్ని వార్తలు