ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి : మిథున్‌ రెడ్డి

4 Dec, 2019 22:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి కేంద్ర ప్రభుత్వం  ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ  వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం లోక్‌సభలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ..విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ  హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విభజన వల్ల ఏపీ ఆర్థికంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి వడ్డీలు, అసలు కలిపి 40 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వెనకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. 

పోలవరం ప్రాజెక్టుకు నిధులను సత్వరమే మంజూరు చేయాలని వెల్లడించారు. ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ ధనాన్ని ఆదా చేశామని తెలిపారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం గ్రాంట్లు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల నవీకరణ కోసం కేంద్రం నిధులను మంజూరు చేయాలని మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు