అసలేం జరిగింది!

12 Aug, 2014 00:14 IST|Sakshi

కాకినాడ క్రైం :కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం బంధువు బోనాసు రాజా మృతదేహానికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టుమార్టం నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించరు. అంతే కాకుండా సాయంత్రం ఐదు దాటిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల మేరకు వైద్యులు ఆ నిబంధనలను తుంగలో తొక్కారు. రాత్రికి రాత్రే పోస్టుమార్టం నిర్వహించడంతో రాజా మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గక తప్పదని రంగరాయ వైద్య కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. తోట నరసింహం మంత్రిగా ఉన్న సమయంలో రాజా వ్యక్తిగత సహాయకునిగా పనిచేసేవాడు.
 
 ఆ సమయంలో ఉద్యోగాలిప్పిస్తామంటూ భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేశారు. అందుకు రాజా మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో ప్రస్తుతం వారు రాజాపై ఒత్తిడి పెంచారు. అయితే అతడు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అతనిని ఎవరో హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కొంతకాలం నుంచి ఎంపీ తోట నరసింహానికి రాజా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో పరిసరాలను పరిశీలించి వారున అతడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాత్‌రూమ్‌లో షవర్‌కు లుంగీతో ఉరివేసుకోవడం నిజం కాదంటున్నారు. షవర్ అతని బరువును మోయలేదని, ఉరివేసుకుంటే అది విరిగిపోయేదంటున్నారు.
 
 అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ముఖంలో పెనుమార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాజా మృతదేహం మాత్రం చాలా ప్రశాంతంగా చనిపోయినట్టు ఉందని, అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడనడంలో వాస్తవం లేదంటున్నారు. మెడ వద్ద కూడా పెద్దగా ఉరివేసుకున్న గుర్తులు లేకపోవడం ఆ అనుమానాలు బలం చేకూరుస్తోంది. రాజకీయ పలుకుబడితో పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, వైద్యులు కేసును నీరుగార్చే అవకాశం లేకపోలేదంటున్నారు. అతని ప్రతర్ధులే అతనిని హతమార్చి ఉంటారనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం పక్కనే రక్తపు మరకలుండడం కూడా చర్చనీయాంశమైంది.
 
 రాజా ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతడి చివరి ఫోన్ కూడా ఓ ప్రముఖ వ్యక్తికి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసులు రంగ ప్రవేశం చేయకుండానే మృతదేహాన్ని ఉరి నుంచి కిందికి దింపేసినట్టు అతడి స్నేహితుడు నల్లా శ్రీనివాస్ చెప్పడం కూడా నమ్మశక్యంగా లేదని సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. రాజా మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని సన్నిహితులు పేర్కొంటున్నారు.
 

మరిన్ని వార్తలు