బాబు పాలన పుత్రుడి కోసం.. జగన్‌ పాలన జనం కోసం..

30 Oct, 2019 07:00 IST|Sakshi
డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి  

ఐదు నెలల్లో 80 శాతం మేనిఫెస్టో అమలు 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లతో ఉపాధి అవకాశాలు 

చిట్టివలసలో రూ.73.46 కోట్ల డ్వాక్రా రుణాల పంపిణీ

సాక్షి, విశాఖపట్నం(భీమిలి): గత ప్రభుత్వంలో చంద్రబాబు పుత్రరత్న పాలన అందిస్తే.. మన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పాలన అందిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చమత్కరించారు. చిట్టివలస బంతాట మైదానంలో మంగళవారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి కింద రూ.73.46 కోట్ల రుణాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పదేళ్ల పోరాటం తరువాత వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టిందన్న విషయం గుర్తు చేశారు. అధికారం చేపట్టిన ఐదు మాసాల్లోనే మేనిఫెస్టోలో పేర్కొన్న 80 శాతం అంశాలను అమలు చేసినట్టు చెప్పారు. తొలి బడ్జెట్‌ సమావేశంలోనే చరిత్రను మలుపుతిప్పే 20 మంచి బిల్లులను ప్రవేశపెట్టి చట్టాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు మంచి చేసే విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ముందంజలో ఉందన్నారు. నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులలో 50 శాతం వారికి ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుందన్నారు. గ్రామ, నగర సచివాలయాల్లో 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. రైతుభరోసా పథకం కింద చెప్పిన దానికంటే ఏడాదికి రూ.13,500 వంతున చేసి అయిదేళ్లలో రూ.67,500 ఇవ్వడానికి సిద్ధమయ్యామన్నారు. అనేక ప్రజోపయోగమైన పథకాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదించాలన్నారు.

కృష్ణా, గోదావరి జలాల నుంచి రాష్ట్ర వాటాను పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్రంలో నీటి అవసరాలకు వినియోగించుకుంటూ పథకాలు రూపొందించుకునేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్య కార్పొరేట్‌ చేతుల్లోనే ఉండిపోయిందని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నామన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పెంచుతామని చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వైఎస్‌ జగన్‌ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోనున్నారన్నారు. దశల వారీగా మద్యం నిషేధంలో భాగంగా గత ప్రభుత్వ హయంలో ఉన్న 43 వేల బెల్టుషాపులను ఇప్పటికే రద్దు చేయగా, 4200 మద్యం దుకాణాలను 3500కు తగ్గించామన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఐదేళ్లలో 25 లక్షల మందికి ఇళ్లు, ఇంటి స్థలాలు ప్రభుత్వం ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుందన్నారు.  

హాజరైన మూడు మండలాల డ్వాక్రా మహిళలు
మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ పార్లమెంట్‌లో 24 మంది ప్రతినిధులతో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ చతురత కారణంగానే జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను పార్టీ గెలుచుకుందన్నారు. పదేళ్లు కష్టపడి ముఖ్యమంత్రి అయిన వై.ఎస్‌.జగన్‌ గురించి సినీనటుడు పవన్‌కు ఏమి తెలుసని ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో బంధువర్గానికి, అనుచరులకు భూములు దోచి పెట్టడంతోనే అయిదేళ్లు గడిపేశారన్నారు. వరదల కారణంగా ఇసుక సరఫరా చేయలేకపోతున్నామన్న కారణం తెలుసుకోకుండా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌ లాంగ్‌మార్చ్‌ నిర్వహించడంలో అర్థం లేదన్నారు. పవన్‌ జనసేనను టీడీపీలో కలిపేయాలన్నారు. నవంబరు 21 నుంచి మత్స్యకారులకు వేట విరామం రూ.4 వేల నుంచి రూ.10 వేలు, డీజిల్‌ సబ్సిడీ రూ.6 నుంచి 9కి పెంచిన దానిని అమలు చేస్తామన్నారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ 2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించేలా సీఎం వైఎస్‌ జగన్‌ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. భూమిలేని పేదలకు భూములు ఇవ్వడానికి ల్యాండ్‌ బ్యాంకు భీమిలిలోనే ఉందన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ లోకేష్‌ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరం కావడంతో ఉక్రోషంతో చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంపీ విజయసాయిరెడ్డి కంకణం కట్టుకుని విశాఖను దత్తత తీసుకున్నారన్నారు. అవకాశం ఉంటే విశాఖను రాజధాని చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్, తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శులు దాట్ల పెదబాబు, సుంకర గిరిబాబు, విశాఖ పార్లమెంట్‌ అనుబంధ సంఘాల నాయకులు జాన్‌ వెస్లీ, కొయ్య ప్రసాదరెడ్డి, పక్కి దివాకర్, రవిరెడ్డి, బోని శివరామకృష్ణ, వెంపాడ శ్రీనివాసరెడ్డి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండల పార్టీ అధ్యక్షులు చెల్లూరి పైడప్పడు, బంక సత్యం, మజ్జి వెంకటరావు, కంటుబోతు రాంబాబు, జీవీఎంసీ 4, 5, 6 వార్డుల అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, లొడగల రామ్మోహనరావు, మాజీ ఎంపీపీ కోరాడ వెంకటరావు, డీఎల్‌డీఏ అధ్యక్షుడు గాడు వెంకటప్పడు, జిల్లా అధికార ప్రతినిధులు ఎస్‌.కరుణాకరరెడ్డి, యలమంచిలి సూర్యనారాయణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ అక్కరమాని రామునాయుడు, డైరెక్టర్‌ అక్కరమాని మంగరాజు, పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగుపల్లి ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు జీరు వెంకటరెడ్డి, అల్లిపల్లి నరసింగరావు, అనుబంధ సంఘాల అధ్యక్షులు జీరు సుజాత, బింగి కిరణ్, వాసుపల్లి కొండబాబు, పందిరి విజయ్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా