కోర్టు ఆదేశించినా బియ్యం పంపిణీ చేయరా?

13 Sep, 2015 04:04 IST|Sakshi

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీరియస్
 
 లింగాల : లింగాల మండలం మురారిచింతలలో చౌక దుకాణ బియ్యం బహిరంగ స్థలంలో పంపిణీ చేయాలని గత సోమవారం హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అధికారులు తుంగలో తొక్కారు. దీంతో మురారిచింతల, దిగువపల్లె గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ నెల 5వ తేదీన గ్రామంలో నిర్వహించిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలందరూ తాము టీడీపీ కార్యకర్త ఇంటికి వెళ్లలేం.. బహిరంగ స్థలంలో పంపిణీ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు.

దీంతో పేదలను దృష్టిలో ఉంచుకొని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సొంత డబ్బుతో బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన  ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం ఉదయం గ్రామ ప్రజలు ఆయనను కలిసి బియ్యం పంపిణీ చేయలేదని మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన తహశీల్దార్ ఎస్.ఎం.ఖాసీంకు ఫోన్‌చేసి  హైకోర్టు ఆదేశాలు అమలుపరచకపోతే తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు