కారులు..కాసులు

21 Apr, 2018 09:12 IST|Sakshi

వాహనాల అద్దె పేరిట రూ.లక్షలు స్వాహా

ఎంపీడీఓకు నెలకు   రూ.35 వేలు మంజూరు

సొంత వాటినే  అద్దె వాహనాలుగా చిత్రీకరణ

ఇదీ ఉపాధి హామీ పథకంలో బాగోతం

జిల్లాకు చెందిన ఓ ఎంపీడీఓ తన సొంత వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం పేరుతోనే ప్రతి నెలా రూ.35 వేలు డ్రా చేస్తున్నారు. ఈ వాహనాన్ని కూడా ఎప్పుడో ఒకసారి తీస్తారంతే. ఆ ఎంపీడీఓనే సొంతంగా డ్రైవింగ్‌ చేసుకుంటారు. బినామీ పేరుతో అద్దె సొమ్మును ఎంచక్కా లాగేస్తున్నారు. ఆ సొంత వాహనంలో ఏ రోజూ క్షేత్ర పర్యటనకు వెళ్లిన దాఖాలాలు లేవు. అడపాదడపా సిబ్బందితో సమీక్షలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉపాధి పథకం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ పొందుతున్నారు. కేవలం ఆ ఒక్క ఎంపీడీఓనే కాదు సింహభాగం ఎంపీడీఓలదీ అదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 90 శాతం మందిదీ ఇదే తంతు.

సాక్షి, మచిలీపట్నం: కష్టజీవుల ఆకలి తీర్చి, ఉపాధి కల్పించేందుకు ప్రారంభించిన గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసులు కురిపిస్తోంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిధులు దోచేయడం, దొంగ బిల్లులు పెట్టి స్వాహా పర్వానికి తెర తీస్తున్నారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఇదిలా ఉంటే అందులో మరో కోణం దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం కేటాయిస్తున్న వాహనాల వాహనాల అద్దె పేరుతో దోపిడీ దారి వెతుక్కున్నారు. నెల గడవడమే ఆలస్యం ఠంచనుగా ఎక్కడికక్కడ నిధులు డ్రా చేసేస్తున్నారు. అసలు వాహనాలనే అద్దెకు తీసుకోలేదు. అతికొద్ది మంది మాత్రమే అద్దె వాహనాలు తీసుకున్నారు. అయినా అద్దెకు వాహనాలు తీసుకున్నట్లు రికార్డులు చిత్రీకరించారు. కొందరు అతి తెలివి ఉపయోగించి.. నెలలో రెండు మూడు రోజులు మాత్రమే అద్దెకు తీసుకుంటున్నారు. వీరితోనే ఖాళీ బిల్లు తీసుకుని అద్దె డ్రా చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇదీ కథ!
జిల్లాలో 49 మండలాలుండగా.. అన్ని మండాల్లో ఉపాధి పనులు సాగుతున్నాయి. ఎంపీడీఓలు క్షేత్రస్థాయికి వెళ్లి ఉపాధి పనులు తనిఖీ నిర్వహించేందుకు అద్దె ప్రాతిపదిక వాహన సౌకర్యం కల్పిస్తారు. ఇలా  ఎంపీడీఓకు నెలకు వాహన అద్దెకు రూ.35 కేటాయిస్తారు. ఆ నిధులు వారు ఎప్పుడైన డ్రా చేసుకోవచ్చన్న వెసలుబాటు కల్పించారు. ఇలా 49 మండలాలుంగా 47 మండలాల్లో కార్లు వినియోగిస్తున్నట్లు సమాచారం.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పకుండా అద్దె వాహనం ఏర్పాటు చేసుకోవాలి. సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చలామని చేస్తున్నారు. ఇలా ఒకటి రెండు కాదు.. జిల్లా వ్యాప్తంగా 90 శాతానికిపైగా ఇదే తంతు సాగుతోంది. వాస్తవానికి ఎవరు ఏ వాహనాన్ని తీసుకున్నారు? ఆ యజమాని ఎవరు? డ్రైవర్‌ పేరు.. అతడి లైసెన్సు వంటి వివరాలన్నీ డ్వామా పీడీ కార్యాలయానికి పంపాలి. కానీ ఆ ఊసేలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. దోపిడీ ఏ స్థాయిలో సాగుతుందో ఇదే నిదర్శనం. అద్దె వాహనాలు పెట్టారా? లేదా? అన్నది డ్వామా అధికార యంత్రాంగం కూడా కనీస శ్రద్ధ చూపలేదు. జిల్లా కేంద్రం నుంచి పీడీ, అదనపు పీడీలు, సహాయ పీడీలు క్షేత్ర పర్యటనకు వెళ్లే సంబంధిత ఉపాధి సిబ్బంది మాత్రమే వారి వెంట వెళ్తున్నారు. స్థానికంగా ఎంపీడీఓలు అసలు వెళ్లడం లేదు. ఉపాధి తమకు సంబంధం లేదన్న నిర్లక్ష్యం వైఖరి వీడలేదు. మండల స్థాయి పథక అధికారి (పీఓ) ఎంపీడీఓనే ఉంటారు. అందుకే ఆయన పేరుపైనే డిజిటల్‌ సంతకాల తాళం (డీఎస్కే) ఉంటుంది. ప్రతి బిల్లు చెల్లింపు ఎంపీడీఓ/ఏపీఓ ద్వారానే సాగుతుంది.

నెలకు అద్దె రూ.35 వేలు...
మండల స్థాయిలో ఉపాధి కీలక అధికారి ఎంపీడీఓనే. పూర్తిస్థాయి పర్యవేక్షణాధికారి ఆయనే. ఆయన ఒక్కరే రెగ్యులర్‌ అధికారి. మిగిలిన ఏపీఓ, ఈసీ, టీసీ, సీఓ.. వంటి కేడర్ల సిబ్బంది మొత్తం హెచ్‌ఆర్‌ పాలసీ కింద ఉన్నారు. అందుకే డీఎస్కే పీఓగా ఉన్న ఎంపీడీఓకే ప్రాధాన్యం ఇచ్చారు. మండలం అంతా విస్తృతంగా తిరిగి కూలీలకు పని దినాలు కల్పించడం. వారి సమస్యలు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడం.. వంటి సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతో అద్దె వాహన వసతిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సంబంధిత మండల సిబ్బందిని వెంట పెట్టుకుని మండలంలో తిరగాలి. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరు నుంచి వాహన వసతిని సమకూర్చారు. ఈ ఏడాది మార్చి దాకా ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ (సీఆర్డీ) ఉత్తర్వు ఇచ్చారు. మొదట్లో రెండు నెలలకు ఒకేసారి రూ.70 వేలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా తప్పుకుండా డ్రా చేస్తేన్నారు. ఇలా ఒక్కో ఎంపీడీఓ అద్దె వాహనం రూపంలో రూ.లక్షలు డ్రా చేశారు. మొత్తంగా నెలకు రూ.16.45 లక్షలు అద్దె వాహనాలకే వెళ్తోంది.  ఎంపీడీఓలు ఏ వాహనం వాడుతున్నారు. దీనికి సంబంధించి వివరాలను నిర్దేశిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో నేరుగా సీఆర్డీ కార్యాలయం నుంచే అద్దె చెల్లించారు. ఈ వాహనాలకు సంబంధించి పీడీ కార్యాలయంలో ఏ వివరాలు లేవు.

ఊసేలేని క్షేత్ర పర్యటన!
ఉపాధి పనుల సీజన్‌ మొదలైంది. పల్లెలకు వెళ్లి కూలీలతో మాట్లాడాలి. గ్రామ సభలు నిర్వహించాలి. వలసలను నియంత్రించేలా పనులు చూపాలి. ఇందుకు సిబ్బందితో నిత్యం సమీక్షలు జరపాలి. జిల్లాలో ఎక్కువ శాతం ఎంపీడీఓలు ఇవేమీ పట్టడం లేదు. నివాస ప్రాంతాల నుంచి తమ కార్యాలయాలకు వెళ్లడం.. సిబ్బందిపై కర్ర పెత్తనం చెలాయించడానికే పరిమితం అయ్యారు. డ్వామా అధికారులు కూడా వారితో పనిచేయించడం లేదు. వారితో ఏనాడూ సమీక్ష జరపలేదు. అందుకే పని దినాలు కూడా రోజూ 60 వేలు కూడా దాటం లేదు. మరోవైపు.. వ్యక్తిగత పనులకే వాహనాలు ఎక్కువ శాతం వినియోగిస్తున్నారు. అత్యధిక శాతం మంది ఎంపీడీఓలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటుండటం, అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి రావడం.. తిరిగి వెళ్లిపోవడం.. దీంతోనే ప్రభుత్వం కేటాయించిన 2,000 కిలో మీటర్లు ముగుస్తున్నాయి. ఇక తమకు కేటాయించిన దూరం తిరిగేశామని మిన్నకుండిపోతున్నా. ఈ విషయమై డ్వామా పీడీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

మరిన్ని వార్తలు