హీరోలా ప్రశ్నిస్తే ఏ పనీ జరగదు

8 Sep, 2018 11:37 IST|Sakshi
నారాయణస్వామిపై తీవ్ర ఆగ్రహంతో గద్దిస్తున్న ఎంపీడీఓ శంకర్‌

ప్రాధేయపడితే అప్పుడు పరిశీలిస్తా..

ఎక్కువ మాట్లాడితే     పోలీస్‌ కేసు పెడతా

మరుగుదొడ్డి లబ్ధిదారుపై ఎంపీడీఓ హుకుం 

అనంతపురం, గుంతకల్లు రూరల్‌: ‘ఏదైనా పనికోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే అధికారులను ప్రాధేయపడాలి. అంతేకానీ హీరోలా ప్రశ్నిస్తే పనులేమీ జరగవిక్కడ. ముందు ఆఫీస్‌లో నుంచి కాలు బయటకు పెట్టి మాట్లాడు. లేదంటే పోలీస్‌ కేసు పెడతా’ అంటూ గుంతకల్లు ఎంపీడీఓ శంకర్‌ వ్యక్తిగత మరుగుదొడ్డి లబ్ధిదారుపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకెళితే.. మొలకలపెంట గ్రామానికి చెందిన నారాయణస్వామి భార్య ఈశ్వరమ్మ పేరిట వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైంది. అయితే ఆర్థిక స్థోమత లేక పనులు మొదలుపెట్టకపోయారు. దీంతో తహసీల్దార్‌ హరిప్రసాద్, ఎంపీడీఓ శంకర్‌లు దగ్గరుండి వారి ఇంటి దగ్గర మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంతలో నారాయణస్వామి అన్న మృతి చెందడంతో దాదాపు 40 రోజుల పాటు పనులను నిలిపివేయాల్సి వచ్చింది. 

జాబితా నుంచి పేరు తొలగింపు
మరోవైపు త్వరితగతిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. కొన్ని నిర్మాణాలు ప్రారంభం కాకపోయినా, మధ్యలోనే నిలిచిపోయినా వాటిని జాబితాలోంచి తొలగించి.. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు ఉన్నతాధికారులకు లెక్కలు చూపించారు. నారాయణస్వామి తన అన్న మరణానంతర కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి మరుగుదొడ్డి పనులు పూర్తి చేశాడు.

బిల్లు చేయలేం..
వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లు రాకపోవడంతో నారాయణస్వామి శుక్రవారం ఎంపీడీఓను కార్యాలయంలో కలిసి సమస్యను విన్నవించుకున్నాడు. నిర్మాణం జాప్యం జరగడంతో జాబితాలోంచి పేరు తొలగించామని, ఇప్పుడు బిల్లు ఏమీ చేయలేమని ఎంపీడీఓ అసహనంతో చెప్పారు. దగ్గరుండి మీరే నిర్మాణ పనులు ప్రారంభించి.. ఇప్పుడు పేరు తొలగిస్తే ఎలా అని ప్రశ్నించిన నారాయణస్వామిపై ఎంపీడీఓ కోపోద్రిక్తులయ్యారు. నీ దిక్కున్నచోట చెప్పుకో అంటూ గద్దించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కట్టుకున్న మరుగుదొడ్డికి బిల్లు మంజూరు కాకపోతే ఏంటి పరిస్థితి అని డీలాపడిపోయిన నారాయణస్వామి ఒక అడుగు వెనక్కు తగ్గాడు. అప్పుడు ఎంపీడీఓ స్పందిస్తూ ‘ప్రాధేయపడి అడుక్కుంటేనే ఏదైనా పని జరుగుతుంది. గట్టిగా అడిగితే ఏ పనీ జరగదు’ అంటూ మందలించడంతో బాధితుడు నారాయణస్వామి కన్నీరుపెట్టుకుంటూ బయటకు నడిచాడు.

>
మరిన్ని వార్తలు