పట్టుదలతో సాధించారు!

10 Mar, 2018 11:43 IST|Sakshi
భర్త మహమ్మద్‌ రఫీతో షంషాద్‌బాను

గ్రూప్‌–1లో ఎంపీడీఓగా ఎంపికైన షంషాద్‌బాను  

కోచింగ్‌ లేకుండానే విజయం  

ఆళ్లగడ్డ: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షంషాద్‌బాను. ఇటీవల విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో బీసీ– మహిళ కోటాలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించారు. తద్వారా ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. షంషుద్దీన్, ఫాతిమాబీ దంపతుల కుమార్తె షంషాద్‌బాను. తల్లిదండ్రులు వంట మనుషులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పేదరికం కారణంగా షంషాద్‌బాను చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానిక ఎంపీపీ మెయిన్‌ స్కూల్, 6 నుంచి 10 వ తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్‌ స్థానిక రాఘవేంద్ర ఎయిడెడ్‌ కళాశాలలో చదివారు. అనంతరం కర్నూలులో డీఎడ్‌ పూర్తి చేశారు.

2000 నవంబర్‌లో నిర్వహించిన డీఎస్సీలో ఎస్‌జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు.  2002లో వివాహమైంది. పెద్ద చదువులు చదివి ప్రజలకు సేవచేయాలన్న తలంపుతో ఉన్న షంషాద్‌బానుకు టీచర్‌ ఉద్యోగం పెద్దగా తృప్తినివ్వలేదు. దీంతో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. భర్త మహమ్మద్‌రఫీ కూడా ఆమెను ప్రోత్సహించాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. మరోవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే విరామ సమయంలో గ్రూప్స్‌నకు సిద్ధమయ్యారు. 2010 గ్రూప్‌–1లో  ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అంతటితో నిరుత్సాహ పడకుండా మళ్లీ 2011 గ్రూప్‌–1లో పోటీపడ్డారు. ఇందులో 363 మార్కులు సాధించారు. బీసీ మహిళ కోటాలో స్టేట్‌ రెండో ర్యాంకు సాధించి..ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ పోస్టుపైనా పెద్దగా ఆసక్తి లేదని, ఎలాగైనా ఆర్డీవో పోస్టు సాధించడమే తన లక్ష్యమని, అందుకు ఇప్పటి నుంచే మళ్లీ ప్రిపేర్‌ అవుతున్నానని షంషాద్‌బాను చెప్పారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా