ఎంపీడీఓల మధ్య కుదరని రాజీ

4 Jul, 2016 11:02 IST|Sakshi

వెనక్కు తగ్గేది లేదన్న రూరల్ ఎంపీడీఓ
ఏజెన్సీ గంగవరం ఎంపీడీఓ అరెస్టు, బెయిల్‌పై విడుదల

రాజమహేంద్రవరం: బదిలీల నేపథ్యంలో ఓ ఎంపీడీఓను మరో మహిళా ఎంపీడీఓ బెదిరించిన కేసులో వారి మధ్య రాజీ కుదరలేదు. వీరు రాజీ పడ్డారేమో అని అనుకుంటున్న తరుణంలో, రూరల్ ఎంపీడీఓ కేసు విషయంలో వెనక్కుతగ్గేది లేదని తేల్చిచెప్పడంతో అధికార వర్గాలు విస్తుపోయాయి. ఈ క్రమంలో ఆ మహిళా ఎంపీడీఓను వారం రోజుల క్రితం బొమ్మూరు పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయిగతంలో రాజమహేంద్రవరం రూరల్ ఎంపీడీఓగా పనిచేసి, బదిలీపై వెళ్లిన ఎస్.సుభాషిణి ప్రస్తుతం ఏజెన్సీ గంగవరంలో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఇక్కడున్న రాజమహేంద్రవరం రూరల్ ఎంపీడీఓ ఎ.రమణారెడ్డిని మేసేజ్‌ల ద్వారా బెదిరించారు. ఎంపీడీఓ రమణారెడ్డి అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులకు, రూరల్ ఎమ్మెల్యేకు, జిల్లా ఉన్నతాధికారులకు మేసేజ్‌లు పెట్టడంతో పాటు సెలవుపై వెళ్లిపోవాలంటూ ఎంపీడీఓకు మేసేజ్‌లు పెట్టారు. అలాగే ఎంపీడీఓ రమణారెడ్డి పనైపోయిందంటూ సహచర ఉద్యోగుల వద్ద మాట్లాడడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 29న ఎంపీడీఓ రమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మేసేజ్‌లు వచ్చిన సెల్‌ఫోన్ నంబరు ఎంపీడీఓ సుభాషిణి వినియోగిస్తున్నట్టు ఐఎంఈఐ నంబరు ద్వారా గుర్తించారు. కోర్టు అనుమతితో బొమ్మూరు పోలీసులు ఎంపీడీఓ సుభాషిణిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

 తప్పుకున్న సంఘ నేతలు :
ఈ కేసులో ఎంపీడీఓల మధ్య రాజీ కుదిర్చేందుకు ఎంపీడీఓల సంఘ నాయకులు ముందుకు వచ్చేందుకు సాహసించ లేదు. ఆమె తీరు ముందునుంచీ వివాదాస్పదంగా ఉండడంతో, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అనవసరమంటూ తప్పుకున్నట్టు సమాచా రం. ఎంపీడీఓ సుభాషిణి భర్త, ఆమె న్యాయవాదులు ఎంపీడీఓ రమణారెడ్డిని కలిసి రాజీ ప్రయత్నాలు చేశారు. రూరల్ ఎంపీడీఓ రమణారెడ్డి కేసు విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చిచెప్పినట్టు సమాచారం. ఇదే విషయన్ని బొమ్మూరు పోలీసులకూ ఆయన స్పష్టం చేయడంతో ఎంపీడీఓ సుభాషిణిని వారం రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ విషయమై బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కనకారావును వివరణ కోరగా, ‘ఎంపీడీఓ కేసు విషయం ఎందుకు, వదిలేయండి’ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు